Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి 3 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. కేబినెట్ ఆమోదం

Advertiesment
ఏపీకి 3 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. కేబినెట్ ఆమోదం
, శుక్రవారం, 27 మార్చి 2020 (20:29 IST)
రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చిక ఆవరణలో  సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు:
2020 - 2021 ఆర్థిక సంవత్సరమునకు గానూ తొలి 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం :

సాధారణంగా 2020-21వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మార్చి నెలాఖరుకు ఆమోదించాల్సి ఉంది. కానీ  అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు అసెంబ్లీ నిర్వహించడం సహేతుకం కాదనే ఉద్దేశ్యంతో మంత్రివర్గం చర్చించి 2020 – 2021 ఆర్థిక సంవత్సరమునకుగానూ తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టె ఆర్డినెన్స్ కు ఆర్టికల్ 213 (1) ప్రకారం కేబినెట్ ఆమోదం తెలిపింది.

త్వరలోనే గవర్నర్ ను కలిసి ఆర్డినెన్స్ ఆమోదించుకుంటామని తెలిపారు. అనంతరం బడ్జెట్ కు సంబంధించిన సమాచారం వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.
 
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కేబినెట్ చర్చ:
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యల పై  కేబినెట్ చర్చించింది. లాక్ డౌన్ అనంతర పరిస్థితులపై ప్రజలు ఏమనుకుంటారనే అంశంపై కేబినెట్ లో చర్చించామన్నారు.

కరోనా వైరస్ నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలు, అవలంభిస్తున్న చర్యలు ఏవిధంగా ఉన్నాయన్న అంశంపై ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయించామన్నారు. 
 
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు:
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేబినెట్ గుర్తించిందన్నారు. విశాఖపట్నంలో 3, విజయవాడలో 3 కేసులు, ఇతర ప్రాంతాల్లో మరో 5 కేసులు నమోదయ్యాయని వివరించారు.
 
విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారు సుమారుగా 28 వేల మంది ఉన్నారని గుర్తింపు:
విదేశాల నుంచి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా 28 వేల మంది వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎం, ఆశావర్కర్ల ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించామని వెల్లడించారు.  మొదటి దశ సర్వేలో 13వేల మంది లెక్క తేలగా, రెండవ దశ సర్వేలో ఆ సంఖ్య 28వేలకు చేరిందని వివరించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తొలుత మార్చి 31వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఉన్నఫలంగా విదేశాల నుంచి వచ్చిన వారు 13వేల మంది అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 14వరకు కర్వ్యూ కొనసాగుతుందని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన మేరకు విదేశాల నుంచి హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వచ్చి మన రాష్ట్రానికి చేరుకున్న వారి సంఖ్య ప్రస్తుతం 28వేలకు చేరిందని మంత్రి వివరించారు,
 
కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు :
కోవిడ్-19వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న, తీసుకోబోయే చర్యలపై కేబినెట్ చర్చించిందన్నారు. ఈ మేరకు కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలను వివరించారు. 104 హెల్ప్ లైన్ కు ఒకేసారి 60 మంది కాల్ చేయవచ్చన్నారు.

ఈ హెల్ప్ లైన్ 24x7 ప్రజలకు అందుబాటులో ఉండటమే కాక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుందన్నారు. ప్రజలకు ప్రాథమిక అవసరాలు, నిత్యావసర వస్తువులు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. నగరాల్లో పెద్ద పెద్ద ప్రాంగణాలు, స్టేడియాల్లో కూరగాయలు అందుబాటులో ఉండేలా నిర్ణయించిందన్నారు.
 
అందుబాటులో 52వేల ప్రత్యేక ఎన్-95 మాస్కులు :
కరోనా వ్యాధి సోకిన వారు మాత్రమే ప్రత్యేక ఎన్-95 మాస్కులు వినియోగించేలా 52వేల మాస్కులు అందుబాటులో ఉంచామన్నారు. అదే విధంగా 10 లక్షల సర్జికల్ మాస్కులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా కరోనా బాధితులను పరీక్షించే డాక్టర్లు, నర్సులు,ఇతర సిబ్బందికి 4వేల పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్(పీపీఈ) అందుబాటులో ఉంచామన్నారు.

అత్యవసరమైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వాడే ఎక్విప్ మెంట్ కూడా  కూడా అందుబాటులో  ఉన్నాయన్నారు. ఎన్- 95 మాస్కులు కావాలని జిల్లాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, ఒకట్రెండు రోజుల్లో మాస్కులు కావాలని ఆర్డర్ చేసిన వారికి అందజేస్తామన్నారు.
 
రాష్ట్రస్థాయిలో  4  ఆస్పత్రుల్లో కోవిడ్- 19 చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు:
తొలిదశ కింద రాష్ట్రస్థాయిలో విశాఖపట్టణం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి   ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు  చేశామని తెలిపారు. సుమారుగా 400 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఒక్కో ప్రాంతంలో 100 చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఆయా ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు ఇంటెన్సెవ్ కేర్ తీసుకుంటారన్నారు. జిల్లా స్థాయిల్లో  200 పడకల ఐసోలేషన్ పడకల ఆస్పత్రిని,  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్ పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేశామన్నారు. 
 
ఒకవేళ కరోనా వ్యాప్తి తీవ్రమైతే రెండవ దశ కింద పరిస్థితులను  ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. ఏక్షణంలో అయినా ఏర్పాట్లు చేయడానికి  సిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి వివరించారు.
 
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్ చర్చ :
కరోనాకు మందు లేని నేపథ్యంలో పలు జాగ్రత్తలను తీసుకుంటే కరోనాను నియంత్రించే అవకాశముందని కేబినెట్ చర్చించిందన్నారు. ముందుగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు.

మరీ ముఖ్యంగా రైతుబజార్లు, మెడికల్ షాపులు, నిత్యావసర సరకులు కొనే సమయంలో మనిషికి మనిషి సుమారు మీటర్ దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు. వికేంద్రీకరణ పాటించాలన్నారు. అదే విధంగా ఇంటిపరిసరాలను, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చేతులు శుభ్రంగా శానిటైజర్ తో గానీ లేదా సబ్బుతో గానీ కడుక్కోవాలని సూచించారు.

విదేశాలు,  పక్క రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలన్నారు. ఒకవేళ అలాంటి వారు వచ్చినట్లు తెలిస్తే గ్రామ, వార్డు వాలంటీర్లకు, ఏఎన్ఎం, ఆశావర్కర్లకు  విషయం తెలపాలన్నారు. ఇది సామాజిక బాధ్యతతో చేయాలన్నారు.
 
గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే కూలీలు, సిబ్బందిపై కేబినెట్ లో చర్చ :
గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే కూలీలు, సిబ్బందికి పని చూపించాలన్నారు.  ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లవచ్చని అయితే కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని తెలిపారు. పని అయిన అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో శానిటైజర్లు కచ్చితంగా వినియోగించాలని తెలిపారు. వ్యవసాయ కూలీలు, కార్మికులు కూడా ఇదే విధానాన్ని పాటించాలన్నారు.
 
అన్ని రకాల సరుకుల రవాణా వాహనాలకు అనుమతి :
అన్ని రకాల సరుకుల రవాణా వాహనాలకు(గూడ్స్) అనుమతి ఇచ్చే దిశగా కేబినెట్ లో నిర్ణయించామన్నారు. 
 
మత్స్య రంగం ఎగుమతి దారులతో రేపు అత్యవసర సమావేశం :
ఆక్వా రంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశాలతో మత్స్యరంగం ఎగుమతిదారులతో రేపు పశుసంవర్థక,మత్స్య శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ అత్యవసర సమావేశంగా హైలెవల్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు.

ఈ సమావేశంలో ఆక్వా ఎగుమతిదారులు, సంబంధిత శాఖాధికారులు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకొని ఆ రంగం ఇబ్బంది పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 
రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు:
రాష్ట్రస్థాయిలో సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన స్టేట్ లెవల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో నలుగురు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు ఐదుగురు మంత్రులు ఉంటారని తెలిపారు. వీరంతా కరోనా కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలను పర్యవేక్షిస్తారన్నారు.

అదే విధంగా జిల్లా స్థాయిల్లో కలెక్టర్ నేతృత్వంలో డిస్ట్రిక్ లెవల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో స్టేట్ లెవల్ కమిటీలోని మంత్రులు మినహా జిల్లా మంత్రులు, ఇతర అధికారులు ఉంటారన్నారు.  నియోజకవర్గ స్థాయిల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. వీరంతా కరోనా కట్టడి విషయంలో కోఆర్డినేటర్ లుగా వ్యవహరిస్తారన్నారు.
 
ప్రతి కలెక్టర్ వద్ద రూ.2 కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు :
స్థానికంగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించి వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద రూ.2 కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
ముఖ్యమంత్రి విజ్ఞప్తి :
ఇతర రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, స్థానికులకు ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని మంత్రి మీడియాకు వివరించారు. కరోనా మందులేని మహమ్మారి అని  ప్రభుత్వం నిస్సహాయతను, అచేతన స్థితిని అర్థం చేసుకోవాలన్నారు. దయచేసి ఇది బాధ్యతతో  కూడిన అంశమని, ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ నిస్సహాయతను అర్థం చేసుకోవాలని కోరారు.

14 నుంచి 28 రోజుల పాటు ఈ వ్యాధి లక్షణాలు బయటపడవని, వ్యాధి లేదని ఎక్కడపడితే అక్కడ తిరగొద్దని తెలిపారు. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలని కోరుతున్నామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సీఎం, సిఎస్ మాట్లాడుతున్నారన్నారు.

హోం శాఖ మంత్రి, డీజీపీలు ఆయా స్థాయి అధికారులతో మాట్లాడారన్నారు. ఎవరు ఎవరితో తిరిగారు చెప్పలేము కనుక అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.  వసతి, భోజనం కల్పించేలా ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 

కూడూ, గూడు లేకుండా ఇబ్బందిపడుతున్న బిచ్చగాళ్ళు, అనాధలతో పాటు వేరే ప్రాంతాల నుండి వలస వచ్చి స్వంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం స్థానికంగా ఉండే కళ్యాణ మండపాలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. అందులో భోజన, వసతి సౌకర్యాలు కల్పించే దిశగా నిర్ణయించామన్నారు. దీన్ని పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు.
 
సమాజ హితం అవసరం లేదా? :
పొరుగు రాష్ట్రాల్లో ఉండిపోయిన మన వాళ్ళు ఇక్కడికి రాలేక పరిస్థితి బాధాకరమే కానీ కరోనా మహమ్మారి ఈ విచిత్రమైన పరిస్థితి ని కల్పించిందని మంత్రి వివరించారు. ఎక్కడివారు అక్కడే ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. అందుకే ప్రజలకు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాము ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఇళ్లకు పంపితే ముప్పు తప్పదని హెచ్చరించారు.

ఏపీకి రావాలనుకునే వారు 14 రోజుల క్వారంటైన్ కు సిద్ధపడి వస్తే సరిహద్దుల్లో సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. ఒకవేళ పొరపాటున క్వారంటైన్ కు సిద్ధపడకుండా ఇంటికి వెళితే కుటుంబీలకు, పొరుగువారికి, సమాజానికి, రాష్ట్రానికి ప్రమాదమన్నారు. సరిహద్దుల వద్ద ఆందోళన చెందుతున్న ప్రజల విషయంలో కూడా కొన్ని మీడియాలు ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యవహరిస్తున్నాయని ఇది సరైనది కాదన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లోనూ రేటింగ్ కోసం ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. క్వారంటైన్ చేయకుండా రాష్ట్రంలోకి ఎలా అనుమతిస్తామని మంత్రి ప్రశ్నించారు. ప్రజలు కూడా ఘర్షణ వాతావరం సృష్టించకుండా సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు అలాంటివారిపట్ల కఠినంగా వ్యవహరించకుండా నోటిమాటద్వారానే సున్నితంగా విషయం చెప్పాలన్నారు.

శృతిమించితే చర్యలకు ఆదేశిస్తామన్నారు. యుద్ధ సమయంలో ఆచరించినట్టే సోషల్ కర్ఫ్యూ పాటించాలని సీఎం కోరినట్లు మంత్రి తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో ప్రభుత్వం మాట్లాడుతోందని, ఎవరు సరిహద్దులకు రావొద్దని ఎక్కడివారు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎంతమేరకు పని చేస్తున్నా ప్రజల సహకారం లేకుండా ఏ పని చేసినా విజయవంతం కాలేదని మంత్రి అభిప్రాయపడ్డారు.
 
"వెనకటికి ఒక సామెత చెప్పినట్లుగా ఇళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే చలికాచుకోచుకోవడానికి ఒకడు వచ్చినట్లు...ఆ పరిస్ధితులు ఇవాళ కనిపిస్తున్నాయి. నిన్న ఒకాయన మాట్లాడుతారు, ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ...మొన్నేమో విదేశాల నుంచి వచ్చిన వారు 13 వేలు అన్నారు, నిన్న జగన్‌మోహన్‌రెడ్డి 28 వేలు అన్నారు, ఒక్కరోజులోనే 15 వేలు పెరిగారా అని మాట్లాడుతారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు?

మీరు కాపురం ఉండేది హైదరాబాద్‌లో, తప్పేం లేదు, హ్యపీగా ఉండండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, ఏ వైరస్‌ లేకుండా  మీ బంగళాలో, రాజప్రసాదంలో ఉండండి. ఎవరికీ భాద లేదు, ఈర్షలేదు. కానీ ఒక్కసారైనా ఏ అధికారిని అయినా ఈ సమాచారం ఎలా వచ్చింది, 13 వేలు 28 వేలు ఎలా అయిందని అడిగారా, ఈ సమాచారం ఎప్పటిది...మార్చి 10 న మేం ఇనిషియల్‌గా వలంటీర్‌ వ్యవస్ధ ద్వారా సర్వే చేసినప్పటిది.

ఆ తర్వాత మార్చి 12. 13కు మాకు ఒక అంచనా వచ్చింది. సుమారుగా 13 వేల మంది రాష్ట్రంలో వచ్చి ఉన్నారని చెప్పారు. మళ్ళీ రెండో విడత సర్వే మొదలుపెడితే మాకు 28 వేలు వచ్చింది. ఏదో విధంగా టూరిస్ట్‌లుగా కానీ ఎన్నారైలుగా కానీ వచ్చిన వారు 28 వేలు అని తేలింది. ఎందుకంత వేగంగా పెరిగిందంటే విమానాలు అన్ని రద్దుచేస్తారని, వ్యాధి తీవ్రత పెరుగుతుందని గబగబా విదేశాల నుంచి వచ్చారు.

లేదా విదేశాల నుంచి హైదరాబాద్‌, బెంగళూరు వచ్చి ఇక్కడికి చేరుకున్నారు. దానిని ఒక పెద్ద నేరంగాను ఇటువంటి రోజుల్లోనూ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న నాయకులనా మనం ఇన్నాళ్ళు పోషించాం అని భాదపడుతున్నాం. ఇంత అనుభవం అని చెప్పుకునే వ్యక్తులు ఈ రకమైన దిగజారి ప్రకటనలు చేయడం దుర్మార్గమైన చర్య.
 
సరిహద్దులు గురించి కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. చానల్స్‌ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ జరిగేటటువంటి అనాలోచిత చర్యలు, ఇంటికెళ్ళాలనే తొందరలో సామాన్యులు సరిహద్దులోకి వచ్చిన సమయంలో ప్రాణాలకు తెగించి మరీ పనిచేస్తున్న అధికారుల విషయంలో విలేకరులు కూడా కొంతమంది ఈ రకంగా ఆలోచన చేయడం శోచనీయం.

అక్కడ ప్రభుత్వాన్ని తప్పుబట్టే పరిస్ధితి, ఇతర ప్రాంతాల నుంచి సరిహద్దులోకి రాగానే క్వారంటైన్‌ చేయకుండా ఎలా వారిని ఇంటికి పంపుతాం అన్న ఆలోచన మీరు ఎందుకు చేయడంలేదు. టీవీ యాజమాన్యాలను కూడా అడుగుతున్నాం...ఎంతసేపు రేటింగ్‌ కోసం తిప్పలు పడితే  ఇది సమాజ హితమా...ధర్మంగా మాట్లాడాలి కదా
 
ఈ రోజుకూ ఈ ప్రభుత్వం చెబుతుంది. ఈ ప్రజలు కానీ ఇక్కడి పౌరులు కానీ రాష్ట్రానికి రావాలనుకుంటే ఖశ్చితంగా మీరు క్వారంటైన్‌కు మీరు సిద్దపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని లోపలకి తీసుకోవడానికి సిద్దంగా ఉంది. బయట రాష్ట్రాలలో మీకు ఇబ్బందులు ఉంటే మీ గురించి అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి, కావాల్సిన సౌకర్యాలు ఏర్పరచడానికి  జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్తున్నాను.

దయచేసి ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండండి. సరిహద్దుల్లో ఏమైనా జరిగితే టీవీ చానల్స్‌ రేటింగ్స్‌ కోసం కాకుండా వాస్తవాలు ఆలోచించండి. అందరూ సహృదయంతో ఆలోచించండి
 
అలాగే ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌లందరినీ ఆదేశించారు, ఎవరైతే నిలువ నీడ లేకుండా రోడ్లపై షెల్టర్‌ లేకుండా ఉన్నారో వారందరినీ కూడా కళ్యాణమండపాలు అద్దెకు తీసుకుని ఏ ఊరికా ఊరుని బట్టి సామాజిక దూరాన్ని పాటించేలా వారి బాగోగులు చూసుకునేలా ఒక అధికారిని ఏర్పాటుచేయడంతో పాటు నిలువ నీడ కూడా కల్పించాలని ఆదేశించారు.

ఎవరికి అయితే ఇళ్ళు ఉండి భోజనానికి ఇబ్బంది పడుతున్నారో వారికి సామాజిక భాద్యతగా ఆహారాన్ని అందించడానికి మీ వంతు సహయం చేయాలని జిల్లా కలెక్టర్‌ల ద్వారా చేయాలని, మీమీ స్ధానిక అధికారులను కలిసి మీరు చేయగలిగినంత చేయాలని పిలుపునిస్తున్నాం.
 
మరోకసారి రాష్ట్రం వెలుపల ఉన్న మన పిల్లలకు, పౌరులకు చేతులు జోడించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేడుకుంటుంది. మీరు ఎవరిని ఎవరిని కలిశారో మీకు తెలీదు. హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లకు కూడా వచ్చింది, కాబట్టి మీరు సహృదయంతో అర్ధం చేసుకోండి.

ఎక్కడి వారు అక్కడే ఉండండి, స్వీయనియంత్రణలో ఉండండి, సామాజిక దూరాన్ని పాటించండి. ఇక్కడికి రాదలుచుకుంటే తప్పకుండా క్వారంటైన్‌ సెంటర్లలో 14 రోజుల పాటు ఉండటానికి సిద్దంగా ఉంటే మేం భాద్యత తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాం" అని మంత్రి అన్నారు.
 
మీడియా ప్రశ్నలకు సమాధానంగా...
ఆర్డినెన్స్‌ అనేది గవర్నర్‌ ముద్రపడగానే మీకు తెలియజేస్తాం. పోలీసులు కొడుతున్నారనే కనిపిస్తుంది. కానీ ఏపీనా తెలంగాణానా అనేది గమనించలేకపోతున్నాం. సీఎం కానీ హోంమంత్రి కానీ సాధ్యమైనంత వరకూ అందరికీ నచ్చజెప్పండి అని మానవీయకోణంలోనే వ్యవహరించండి అని చెప్తున్నాం.

ఎక్కడైనా శృతిమించితే ఆ అధికారిపై చర్యలు తీసుకుంటాం. అందరికీ మాస్కులు అందజేశాం, ఎక్కడైనా అజాగ్రత్తగా ఉంటే మీ ద్వారా కూడా వ్యాధి సోకే అవకాశం ఉంది, ఎంత పెద్ద వారికైనా వ్యాధి వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. తప్పుచేసిన అధికారులు ఎవరైనా చర్యలు తీసుకుంటాం.

వ్యవసాయపనుల కోసం కూలీలు, యజమానులు అందరూ సామాజిక దూరం పాటించాలి. గ్రామస్ధాయి అధికారులు అంతా పర్యవేక్షిస్తున్నారు. హనుమాన్‌జంక్షన్‌ లో మీడియాపై జరిగిన దాడిపై మేం డిజిపిగారికి కూడా చెప్పాం, సంబంధిత అధికారిపై చర్య తీసుకోవాలని చెప్పాం.

రైతుబజార్ల వికేంద్రీకరణ జరిగింది, కూరగాయలు అన్నీ నిర్ణీత రేట్లకే అమ్ముతున్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటున్నాం. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతిక్షణం సిబ్బంది సిద్దంగా ఉన్నారు. 108 సర్వీసులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబూల్ గురుద్వారాపై దాడి.. కేరళ వ్యక్తి ఫోటోను విడుదల చేసిన ఐసిస్