బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న... చిన్నారి సాయిశ్రీ దిక్కులేని మృతి
కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ఈ హృదయ విదారక ఘటన విజయవాడలో జరిగింది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు అతడి ఇంటికి తిరిగినా కనికరించకపోవడంతో క
కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ఈ హృదయ విదారక ఘటన విజయవాడలో జరిగింది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు అతడి ఇంటికి తిరిగినా కనికరించకపోవడంతో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ప్రాణం పోవడానికంటే ముందు ఆ పాప మాట్లాడిన వాట్సాప్ వీడియో అందరినీ కంటతడిపెట్టిస్తోంది.
నాగేంద్ర అపార్ట్‌మెంట్‌లో తన తల్లితో కలిసి నివాసం ఉంటోన్న 12 ఏళ్ల బాలిక సాయిశ్రీ క్యాన్సర్‌తో మృతి చెందింది. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం డబ్బు అవసరం ఉండటం.. విభేదాలతో బాలిక తండ్రి కొంతకాలం క్రితం వదిలి వెళ్లడంతో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తల్లి వైద్యం చేయించలేకయింది. దీంతో పరిస్థితి విషమించి బాలిక తుదిశ్వాస విడిచింది.
విజయవాడకు చెందిన మాదంశెట్టి శివకుమార్, సుమశ్రీలు భార్య భర్తలు. ఇరువురు విడిపోయారు. వారికి సాయిశ్రీ అనే పాప ఉంది. అయితే, వారు విడిపోయే సందర్భంలో సాయిశ్రీ పేరిట దుర్గాపురంలో ఓ ఇంటిని రాసిచ్చాడు శివకుమార్. అతడు ఓ రౌడీ షీటర్.. పైగా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో పాటు పలువురి నాయకుల అండదండలు ఉన్నాయి. అయితే, అనూహ్యంగా సాయిశ్రీ ఇటీవల క్యాన్సర్ బారిన పడింది. ఆమెను రక్షించుకునేందుకు తల్లి సుమశ్రీ తన వద్ద ఉన్న సొమ్మంతా వెచ్చించింది. మెరుగైన వైద్యం చేయించకుంటే పాప బతకదని అపోలో వైద్యులు చెప్పడంతో బెంగళూరు కేన్సర్ వైద్యం కోసం తీసుకెళ్లాలనుకున్నారు.
సాయిశ్రీకి కేన్సర్ ఉన్నట్లు తెలుసుకున్న శివకుమార్ అదే అదనుగా చూసుకొని ఎమ్మెల్యే బోండా అండదండలతో కొంత మంది కబ్జాదారులతో దుర్గాపురంలో కూతురుకి రాసిచ్చిన ఆ ఇంటిని కబ్జా చేయించారు. అయితే, తన ప్రాణం రక్షించుకునేందుకు ఆ ఇంటిని అమ్ముకునే అవకాశం ఇవ్వాలంటూ సాయిశ్రీ, ఆమె తల్లి సుమశ్రీ శివకుమార్ ఇంటి చుట్టూ దాదాపు పది రోజులు తిరిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాణాలు పోతున్నాయి నాన్న అని కన్న కూతురు చెబుతున్నా శివకుమార్ మనసు కరగలేదు. పైగా బెదరింపులకు దిగాడు. దీంతో అరకొర వైద్యం మాత్రమే పొందుతున్న సాయిశ్రీ ప్రాణాలు కోల్పోయింది.
తమ నుంచి విడిపోయిన తండ్రి పట్టించుకోవడం లేదని తెలుసుకున్న చిన్నారి... చనిపోయేందుకు మూడు రోజుల ముందు తండ్రికి వాట్సాప్ ద్వారా వీడియో మెసేజ్ పంపింది. తనకు చదువుకోవాలని ఉందని.. ఎలాగైనా బతికించాలని విన్నవించింది. తన పేరిట ఉన్న ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో తనకు వైద్యం చేయించాలని బతిమలాడింది. అపార్ట్‌మెంట్‌ను అమ్మేందుకు ప్రయత్నించినా... స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా సన్నిహితులు ఇంటిని ఆక్రమించుకున్నందున అమ్మలేక పోయినట్లు బాలిక తల్లి సుమశ్రీ తెలిపింది. తన కూతురు చావుకు కారణమైన భర్త సహా, అపార్ట్‌మెంటును ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.