ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ రిజర్వాయర్‌లో కొందరు పర్యాటకులు బోటులో షికారు చేస్తుండగా అది ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో పడవలోని 12 మంది పర్యాటకులు గల్లంతయ్యారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో అవుకు రిజర్వాయర్ ఉంది. ఇక్కడకు కొంతమంది పర్యాటకులు విహారయాత్రకు వచ్చారు. వారిలో కొందరు బోటులో ప్రయాణిస్తూ రిజర్వాయర్‌లో షికారు చేస్తుండగా ఒక్కసారిగా పడవ బోల్తాపడింది. ఇందులోని 12 మంది గల్లంతయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకదళ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు, ఇప్పటివరకు రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వారంతా చనిపోయివుంటారని పోలీసులు భావిస్తున్నారు. పర్యాటకులంతా తమిళనాడులో రాష్ట్రంలోని తంజవూరుకు చెందిన వారిగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.