సోనియమ్మపై సాక్షిలో కథనం: కంటనీరు పెట్టుకున్న గంగమ్మ!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వ్యతిరేకంగా "సాక్షి"లో ప్రసారమైన కథనంపై మనస్తాపానికి గురైన ఎమ్మెల్యీ గంగా భవానీ కంటనీరు పెట్టుకున్నారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఎలాంటి పదవులను ఆశించక కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్న సోనియా గాంధీపై సాక్షిలో వ్యతిరేకంగా కథనం ప్రసారం కావడంపై తన్నుకొస్తున్న ఏడుపును దిగమింగుకోలేక గంగమ్మ మీడియా ముందు కన్నీళ్లు పెట్టారు. సోనియా గాంధీపైనే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యపై జగన్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. జగన్‌పై సోనియా గాంధీతో పాటు తనకు వైఎస్సార్ తనయుడిగా ప్రేమ ఉందని, కానీ సాక్షిలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రసారం కావడం దురదృష్టకరమన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిపై కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావు ధ్వజమెత్తారు. ఓ ఫాక్షనిస్టును పిసిసి అధ్యక్షుడిగా చేశారని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా సాక్షి కథనాలను శంకరరావు తీవ్రంగా ఖండించారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ సాక్షి పెట్టుబడులపై సిబిఐ విచారణ కోరుతామని ఆయన అన్నారు. వైయస్ రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 30 సీట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అయితే 2004లో ఇందిరమ్మ పాలన తెస్తాం, రాజీవ్ గాంధీలా పరిపాలిస్తాం అని వైయస్ చెప్పటం వల్ల ప్రజలు ఓటు వేసి గెలిపించారని ఆయన అన్నారు.మరోవైపు సాక్షిలో ప్రసారమైన కథనంపై కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పక్కా వూహ్యంతోనే జగన్ ఆ కథనాన్ని ప్రసారం చేశారని మండిపడ్డారు. జగన్‌వి చిన్న కుర్రాడి చేష్టలని, కాంగ్రెస్ పార్టీని విడిపోయి, వేరే పార్టీ పెట్టాలని చూస్తున్నారని కేకే ఆరోపించారు. పార్టీ నుంచే వెళ్లాలనే ఉద్దేశంతోనే జగన్ ఇలాంటి రెబల్ చేష్టలు చేస్తున్నారని కేకే వ్యాఖ్యానించారు.