వరంగల్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ.ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థానంలో ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
పరిశోధనా కేంద్రంగా మొదలై 75 సంవత్సరాలలో... ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్న వరి వంగడాలు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశంలోనూ ప్రసిద్ధి చెందాయన్నారు. ఈ వంగడాలను అనేక మంది రైతులు వినియోగించడం ద్వారా వరంగల్ జిల్లాకు పేరు ప్రతిష్టలు లభించాయని మంత్రి వెల్లడించారు.
108 కోట్ల మనదేశ జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాలు మనదేశంలో ఉత్పత్తి అవడమే గాక విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితికి మన రైతాంగం అభివృద్ధి చెందడం మనకు గర్వకారణమని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. దీనికి మూల కారణం రైతులు, శాస్త్రవేత్తల పనితీరేనని కొనియాడారు.
అమెరికా వారికి ఆహార ధాన్యాలు కావాలని అడగటానికి అహంకారం అడ్డొచ్చి, ప్రపంచంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడటానికి భారతదేశంలోని జనాభా అవసరానికి మించి తింటున్నారన్న కారణం చూపించారని మంత్రి వెల్లడించారు. మన రైతులు నాణ్యమైన విత్తనాలతో అధిక ఉత్పత్తులు సాధించి, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని రైతులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి, హర్టికల్చర్ మరియు వెటర్ని రంగాలకు వేరు వేరు విశ్వవిద్యాలయాలు నెలకొల్పడం రైతులపై ప్రభుత్వానికి గల చిత్తశుద్ధిని తెలియజేస్తుందని రఘువీరారెడ్డి చెప్పారు. వ్యవసాయ పరిశోధనల కోసం బడ్జెట్‌లో నిధుల శాతం మనం పెంపొందించుకోవలసిన అవసరమెంతైనా ఉందని, దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యుత్ సరఫరాపై రైతులు లేవనెత్తిన సమస్య గురించి మంత్రి మాట్లాడుతూ... రిలయన్స్ నుండి త్వరలో గ్యాస్ సరఫరా అవుతుందని, తద్వారా రాష్ట్రంలో విద్యుత్తుకు సమస్య లేకుండా పోతుందని సమాధానమిచ్చారు.
ఎరువుల సరఫరా గురించి మాట్లాడుతూ... దేశం మొత్తం మీద లక్షా 30వేల కోట్ల సబ్సీడీనీ ఎరువుల మీద ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ఎరువులను బ్లాక్‌లో అమ్ముతున్న 45మందిపై గత 15 రోజులలో కేసులు పెట్టామని, అందులో 26 మందిని అరెస్టు చేయించామని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ... మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై చూపినంత అభివృద్ధి, ఏ రాష్ట్ర ప్రభుత్వం చూపలేదని అన్నారు. రుణమాఫీ వలన దేశ వ్యాప్తంగా 4 కోట్లమంది, రాష్ట్రంలో 83లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారని వివరించారు.