రైతుల కోసమే పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిర్మించిన రైతు కుటుంబ విగ్రహాలను మంత్రి ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
రైతులకు, ప్రభుత్వానికి మధ్య బ్రోకర్లుండరని, ప్రభుత్వం రైతుల హృదయాలలో ఉన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తోందని అన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా రైతులుండాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి రైతు సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. జనార్థన్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుకుటుంబం విగ్రహాలను తయారు చేసిన శిల్పి సోమయ్యకు వ్యవసాయ శాఖ మంత్రి పట్టుశాలువా కప్పి, జ్ఞాపికనిచ్చి సన్మానించారు.