చిరంజీవి 'గజనీ' హీరోలా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను పీఆర్పీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి కొట్టిపారేశారు. ఇంకా రాజకీయంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని, పార్టీని విలీనం చేసిన చేశాక మళ్లీ తిరిగి పునరుద్ధరించేందుకు అవకాశం ఉండవచ్చునని శ్రీధర్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత చిరంజీవికి సముచిత స్థానం లభించకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగుతామని కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో అవినీతి సొమ్ముతో పార్టీని నడపటం ఎవరనే విషయం ప్రజలకు తెలుసునని చెప్పారు. అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్న అంబటికి.. చిరంజీవిని విమర్శించే హక్కు లేదన్నారు. తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన మునెమ్మను పీఆర్పీ ప్రకటించింది. అయితే మునెమ్మను కూడా కొనుగోలు చేసి వైఎస్సార్ పార్టీలోకి చేర్చుకున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. దీనిని బట్టి వైఎస్సార్ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో అర్థమవుతుందన్నారు.