ప్రభుత్వం తమ తలకు తుపాకీ ఎక్కుపెట్టి శాంతి చర్చలకు రమ్మని ఆహ్వానించడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. అయినప్పటికీ.. తమ నిరసను తెలియజేందుకు ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి చర్చా వేదిక వద్దకు వచ్చినట్టు టీఎన్జీవో నేత స్వామి గౌడ్ తెలిపారు.
ప్రభుత్వంతో శుక్రవారం జరిగిన తెలంగాణ ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమైన విషయం తెల్సిందే. కేబినెట్ సబ్ కమిటీతో చర్చలను ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. చర్చలు మొదలైన పది నిమిషాల్లోనే ఉద్యోగ సంఘాల నేతలు అర్థాంతరంగా సమావేశ హాలు నుంచి బయటకు వచ్చేశారు.
అనంతరం స్వామి గౌడ్ మాట్లాడుతూ.. ఎస్మా ప్రయోగం, జీవో 166, 177 లను తొలగిస్తేనే చర్చలకు వస్తామని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద పారా మిలటరీ బలగాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాతే ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఆయన తేల్చి చెప్పారు.