అభం శుభం ఎరుగని పసిమొగ్గ నాగ వైష్ణవిని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. రెండు రోజుల క్రితం విజయవాడలో కిడ్నాప్‌కు గురైన వైష్ణవి గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లో దారుణ హత్యకు గురై శవమై కన్పించింది.
ఆటో నగర్‌లో ప్లాట్ నెంబరు 445లో బాలిక శవం లభ్యమైంది. వైష్ణవి శరీరం కాలిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. బాయిలర్‌ను వేసి బాలికను కాల్చి చంపేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైష్ణవి హత్య వార్త తెలియడంతో బాలిక కుటుంబం షాక్‌కు గురైంది. తండ్రి ప్రభాకరరావుకి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. గత రెండు రోజులుగా వైష్ణవి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకున్న రాష్ట్ర ప్రజలు సైతం విషాదంలో మునిగిపోయారు. హంతకులు మానవత్వం లేని రాక్షసులుగా మారి చిన్నారి వైష్ణవిని పొట్టనబెట్టుకున్నారు. బాలికను అత్యంత కర్కశత్వంగా హతమార్చిన వైనాన్ని చూసినవారి గుండె తరుక్కుపోతోంది.
విజయవాడలోని ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె వైష్ణవి కారులో పాఠశాలకు వెళుతుండగా దుండగులు అడ్డగించి డ్రైవరును హతమార్చి వైష్ణవిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా బాలిక హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తమ్మీద సమీప బంధువులే వైష్ణవిని హత్య చేయించినట్లు ప్రాధమిక సమాచారం.
వైష్ణవిని పాశవికంగా హతమార్చిన దుండగలను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కేసును తక్షణం పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామన్నారు.