Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింగిల్‌గా వస్తానని.. శవాలతో వస్తున్న జగన్‌ : నారా లోకేశ్

nara lokesh

ఠాగూర్

, శనివారం, 6 ఏప్రియల్ 2024 (08:50 IST)
ఎన్నికలకు సింగిల్‌గా వస్తానని చెప్పిన జగన్‌ శవాలతో వస్తున్నారని.. 2014లో తండ్రి, 2019లో బాబాయ్‌ మరణాల్ని చూపి సానుభూతి పొందినట్లే.. ఇప్పుడు పింఛనుదారుల మరణాలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్‌, వైకాపా బీసీసెల్‌ నేత తాడిశెట్టి మురళీమోహన్‌ సహా పలువురు ముఖ్యనేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, జగన్‌ రెడ్డి 2019లో బాబాయ్‌ను చంపేసినట్లే.. ఇప్పుడు వృద్ధుల ఉసురుతీయడానికి సిద్ధపడ్డారని విమర్శించారు. 
 
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక పింఛను, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే అందిస్తామన్నారు. చంద్రబాబు 2019లో హామీ ఇవ్వకపోయినా పింఛనును రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచారని గుర్తు చేశారు. జగన్‌ పాలనలో బీసీ సోదరులపై 26 వేలకు పైగా అక్రమ కేసులు నమోదు చేశారని,  బాపట్ల జిల్లాలో అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్‌నాథ్‌గౌడ్‌ అనే బాలుణ్ని పెట్రోల్‌ పోసి దారుణంగా చంపారన్నారు. 
 
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి వారికి వృత్తి పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. మసీదుల మరమ్మతులకు నిధులు, దుల్హన్‌ పథకం, విదేశీ విద్య ద్వారా మైనారిటీలను ఆదుకుంటామన్నారు. రాష్ట్రం రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, ఈ పరిస్థితిలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరమన్నారు.
 
ఐదేళ్ల క్రితం వరకు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆంధ్రులకు ఒక గుర్తింపు ఉండేదని.. సీఎం జగన్‌ ఇప్పుడు రాష్ట్రాన్ని దక్షిణ భారత బీహార్‌గా మార్చారని లోకేశ్‌ మండిపడ్డారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంస పాలనపై గురువారం రాత్రి దాదాపు 1000 మంది ఎన్నారైలతో లోకేశ్‌.. దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. వారంతా స్వదేశానికి వచ్చి రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తెదేపా ఎన్నారై, గల్ఫ్‌ ఎన్నారై విభాగాల అధ్యక్షులు రవి వేమూరి, రావి రాధాకృష్ణ పాల్గొన్నారు.
 
అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీల్ని బలితీసుకుంటారు జగన్‌రెడ్డీ? అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పెండ్లిమర్రిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులు హత్యపై ఎక్స్‌ వేదికగా శుక్రవారం స్పందించారు. ‘‘జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ముఠా శ్రీనివాసులు భూమిని కబ్జా చేసి, అత్యంత దారుణంగా హతమార్చింది. కాపాడాల్సిన ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి హంతకులకు మద్దతుగా నిలిచారు’’ అని లోకేశ్‌ మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడపలో కల్యాణ్ జ్యుయలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన ప్రముఖ నటి శ్రీలీల