Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ షర్మిల నా తండ్రి వైఎస్ఆర్ వారసురాలేనా? వైఎస్ జగన్ సూటి ప్రశ్న

ys jagan

వరుణ్

, గురువారం, 25 ఏప్రియల్ 2024 (17:14 IST)
తన చెల్లి వైఎస్ షర్మిలను లక్ష్యంగా చేసుకుని వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు వైఎస్ షర్మిల తన తండ్రికి వారసురాలేనా అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ కీర్తి ప్రతిష్టలను చెరిపివేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. వారి కుట్రలో భాగంగానే తన సొంత చెల్లి వైఎస్ షర్మిల, మరో చెల్లి వైఎస్ సునీతలు భాగస్వాములయ్యారంటూ విమర్శలు గుప్పించారు. పైగా, కడప వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాశ్ రెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని సీఎం జగన్ మరోమారు వెనుకేసుకొచ్చారు. 
 
ఆయన బుధవారం పులివెందుల నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి, జగన్‌లపై లేనిపోని ముద్ర వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్), వదినమ్మ (పురంధేశ్వరి) ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వీరి కుట్రలో భాగంగా వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకొస్తున్నారని... ఆ మహానేతకు వారసులు ఎవరో ప్రజలే చెప్పాలని అన్నారు. 
 
వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఛార్జ్‌షీట్‌లో వైఎస్ పేరును చేర్చింది ఎవరు? అని జగన్ ప్రశ్నించారు. వైఎస్సార్ కీర్తి, ప్రతిష్టలను చెరిపివేయాలని ప్రయత్నిస్తున్నారని, ఆయన విగ్రహాలను తొలగిస్తామని చెపుతున్నారని... అలాంటి వాళ్లతో చేయి కలిపిన వాళ్లా వైఎస్సార్ వారసులు? అని షర్మిల, సునీతలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, పవన్, బీజేపీల కుట్రలో తన చెల్లెమ్మలు భాగమయ్యారని విమర్శించారు.
 
చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో ఆ దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసని జగన్ అన్నారు. వివేకాను చంపిన వ్యక్తికి మద్దతు ఇస్తున్నది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. పలు ఇంటర్వ్యూలలో అవినాశ్ లేవనెత్తుతున్న ప్రశ్నలు కరెక్టేనని అన్నారు. అవినాశ్ తప్పు చేయలేదని... తప్పు చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని చెప్పారు. అవినాశ్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని... పసుపు మూకల కుట్రలో మన చెల్లెమ్మలు భాగస్వాములయ్యారని అన్నారు. రాజకీయ స్వార్థంతో ఈ కుట్రలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
 
పులివెందుల తన సొంత గడ్డ, తన ప్రాణానికి ప్రాణమని జగన్ చెప్పారు. పులివెందుల అంటే ఒక నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ అని అన్నారు. పులివెందులలో ఏముంది అనే స్థాయి నుంచి పులివెందులలో ఏంలేదు అనే స్థాయికి చేరుకున్నామని అన్నారు. కడప కల్చర్, పులివెందుల కల్చర్, రాయలసీమ కల్చర్ అని మనవైపు వేలెత్తి చూపిస్తున్నారని... మంచి మనసు కలిగి ఉండటం, బెదిరింపులకు లొంగకపోవడమే మన కల్చర్ అని చెప్పారు. టీడీపీ మాఫియాను నాలుగు దశాబ్దాల పాటు ఎదిరించింది పులివెందుల బిడ్డేనని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి పడి ఉద్యోగం ఊడగొట్టుకున్న భారతీయుడు.. ఎక్కడ?