Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 : ఆ జిల్లాల ఓటర్లు పట్టం కట్టిన పార్టీదే అధికారం!!

Andhra Pradesh Lok Sabha Election results 2024

వరుణ్

, మంగళవారం, 4 జూన్ 2024 (07:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గతంలో లేనివిధంగా ఉత్కంఠత నెలకొంది. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఐదేళ్లుగా రాష్ట్రం అన్ని విధాలుగా తీవ్రంగా నష్టపోయింది. వైకాపా పాలకులు అనుసరించిన విధ్వంస పాలన కారణంగా రాష్ట్రం అప్పులపాలైంది. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంపద సృష్టిపై ఆధారపడకుండా, కేవలం అప్పులపైనే ఆధారపడి గత ఐదేళ్లుగా పాలన సాగించారు. అందుకే ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రతి ఒక్కరికి అమితాసక్తి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో రాజకీయ ఉద్దండుల నుంచి సాధారణ స్థాయి కార్యకర్తల వరకు ఇప్పుడు అందరి చూపు గోదావరి జిల్లాల వైపే ఉంది. అందులోనూ ఉమ్మడి పశ్చిమ ఫలితాలపై ఆసక్తి ఎక్కువే. ఇక్కడ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీకే అధికార పగ్గాలు దక్కడం ఆనవాయితీగా మారిపోయింది. గత చరిత్ర కూడా ఇదే చెబుతుంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 
ఉమ్మడి పశ్చిమలో 2004 నుంచి ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఇక్కడ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతోంది. 2004లో 16 స్థానాలకు కాంగ్రెస్‌ 12 చోట్ల విజయం సాధించగా టీడీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. 2009లో మొత్తం 15 స్థానాలకు 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా 5 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 
 
ఒక స్థానంలో ప్రజారాజ్యం గెలుపొందింది. మళ్లీ కాంగ్రెస్‌కే అధికార పగ్గాలు దక్కాయి. 2014 ఎన్నికల్లో 15 స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. ఆ పార్టీకే అధికారం వరించింది. 2019లో 15 స్థానాలకు 13 వైకాపా, 2 చోట్ల టీడీపీ విజయం సాధించగా వైకాపా అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇలా గత నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆనవాయితీగా మారింది.  
 
అందుకే ఎప్పటిలాగే ఈ సారి కూడా ఉమ్మడి పశ్చిమ ఎన్నికల ఫలితమే కీలకంగా భావిస్తున్నారు. మంగళవారం వెలువడే ఫలితాల్లోనూ ఇదే ఆనవాయితీ కొనసాగుతుందని గట్టిగా నమ్ముతున్నారు. మా పార్టీకే ఎక్కువ సీట్లు అంటూ రెండు పార్టీల నాయకులు మొదలు కార్యకర్తల వరకు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇదే అంశంపై రూ.కోట్లలో పందేలు పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ జిల్లాలుగా విడిపోయాక జిల్లాకు 7 చొప్పున మొత్తం 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో మరికొద్ది గంటల్లో తేలనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు... తొలుత పోస్టల్ బ్యాలెట్ల నుంచి ప్రారంభం..