జనసేన పార్టీకి బక్కెట్ గుర్తు టెన్షన్ పట్టుకుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నారు. అయితే, ఈ గ్లాసును పోలిన గుర్తు అయిన బక్కెట్ గుర్తు ఆ పార్టీ నేతలతో పాటు అభ్యర్థులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. జనసేన పార్టీ గుర్తింపు రాజకీయ పార్టీ కాకపోవడంతో ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కామన్ సింబల్ జాబితాలో చేర్చారు.
ఈ జాబితాలో గాజు గ్లాసును పోలినట్టుగా ఉండే బక్కెట్ సింబల్ కూడా ఉంది. ఇది జనసేన పార్టీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది. బక్కెట్ గుర్తుతో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. దీంతో ఓటర్లు బక్కెట్, గాజు గ్లాసు గుర్తుల్లో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
అలాగే, పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పవన్ కళ్యాణ్, ఆ పార్టీకి చెందిన మరో ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిలు బరిలోకి దిగారు. ఇదే పేర్లతో మరికొందరు అభ్యర్థుల కూడా పోటీ చేస్తున్నారు. అందువల్ల ఓటర్లు కన్ఫ్యూజ్‌కు గురయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ నేతు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్ ఆ పార్టీని ఇబ్బందికి గురిచేసిన విషయం తెల్సిందే.