సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభతో పాటు దేశ వ్యాప్తంగా 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగిసింది.
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల కంటే రెండు గంటలు ముందుగానే పోలింగ్ ముగించారు. నాలుగు గంటల లోపు క్యూలో ఉన్నఓటర్లను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు.
కాగా, ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరివున్నారు. ఫలితంగా పోలింగ్ కేంద్రాలు రద్దీగా ఉన్నాయి. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్లలో నిలబడిన ఓటర్లలో చివరి ఓటరు ఓటు వేసేంత వరకు పోలింగ్ కొనసాగుతుంది.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 16 స్థానాల్లో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగిసింది. ఒక్క నిజామాబాద్ స్థానంలో మాత్రం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ స్థానంలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.