జనసేన పార్టీ కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తానని నటుడు నాగబాబు అన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ పేరుకే తనకు తమ్ముడనీ, నిజానికి సాధారణ జనసేన కార్యకర్తల్లాగే తనకూ పవన్ నాయకుడన్నారు.
పార్టీలో చేరకముందే ఎలాంటి బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. జనసేన కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని ఇచ్చినా చేసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు.
కానీ, తనకు నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా నిలబెట్టి పవన్ గొప్ప గౌరవం ఇచ్చారన్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తి, బలం, ధైర్యంతోనే ఇటీవల తాను మాట్లాడానని స్పష్టంచేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కల్యాణ్‌కు నాగబాబు కృతజ్ఞతలు చెప్పారు.
రాజకీయాల్లోకి రావాలని తనకు చాలా కోరికగా ఉండేదన్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత వాటన్నింటిని వదిలేశానని చెప్పారు. ఆ తర్వాత తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినా తాను దూరంగానే ఉన్నానని చెప్పారు. తమ్ముడిని తమ్ముడిగా కాకుండా నాయకుడిగా చూడాలని తాను భావించానన్నారు. పవన్ కల్యాణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేత అని నాగబాబు కొనియాడారు.
పైగా, పవన్ కల్యాణ్ విషయంలో జోక్యం చేసుకోరాదని తమ ఫ్యామిలీ ఓ అవగాహనకు వచ్చిందన్నారు. పవన్ గతంలో తన ఫోన్లను ఎత్తేవాడు కాదనీ, ఎందుకొచ్చిందిలే అని భావించేవాడని చెప్పి, నవ్వులు పూయించారు. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నాగబాబుకు కేటాయించిన సంగతి తెలిసిందే.