Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతీయ పతాకం నియమాలు

జాతీయ పతాకం నియమాలు
FILE
ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15వ తేదీని "భారత స్వాతంత్ర్య దినోత్సవం"గా జరుపుకుంటున్నాం. జాతి, కులం, మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతిఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే వేడుక "పంద్రాగస్టు పండుగ".

ఈ రోజున పాఠశాలల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, కళాశాలల్లోనూ... ఇలా రకరకాల చోట్ల మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ.

అయితే మన జాతీయ పతాకాన్ని ఎలాబడితే అలా ఎగురవేయకూడదు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం సూచించిన కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. ఆ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ... "మువ్వన్నెల రెపరెపలు మురిపాలను చిందించేలా" జాతీయ పతాకాన్ని ఎగురవేయాల్సి ఉంటుంది. ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం...

జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ, కొన్ని స్థలాలలో కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు. జాతీయ పతాకం ఎగురవేయడంలో సరియైన పద్దతులు, సంప్రదాయాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది. వీటిని "ఫ్లాగ్ కోడ్-ఇండియా"లో పొందు పరిచారు. దీనిలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం అన్నిసందర్భాలలోనూ "ఇండియన్ స్టాండర్డ్ సంస్థ" నిర్దేశించిన నిర్ధిష్టమైన ఆదేశాలకు కట్టుబడి ఉండి, ఐ.యస్.ఐ మార్కుని కలిగి ఉండాలి. మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం సమంజసం.

జాతీయ జెండా కొలతలు : 21'x14'; 12'x8', 6'x4', 3'x2', 9'x6', సైజుల్లో మాత్రమే ఉండాలి. సందర్భాన్ని బట్టి జెండా ఏసైజులో ఉండాలో "ఫ్లాగ్ కోడ్"లో పేర్కొన్నారు. జెండా మధ్యభాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులోనే ఉండాలి.

ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలి. జాతీయజెండాని అలంకరణ కోసం వాడకూడదు. అలానే జెండా ఎగురవేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో నేలను తాకకూడదు. జెండాను ఎగురవేసేటప్పుడు వేగంగాను, అవనతం చేసేటప్పుడు మెల్లగానూ దించాలి.

జాతీయ పతాకంలో కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి. సూర్యోదయానంతరం మాత్రమే పతాకం ఎగురవేయాలి. అలాగే సూర్యాస్తమయం కాగానే జెండాను దించేయాలి. పతాకాన్ని ఏవిధమయిన ప్రకటనలకు ఉపయోగించరాదు. అంతేకాక పతాక స్థంభం‌పైన ప్రకటనలను అంటించరాదు, కట్టరాదు.

ప్రముఖనాయకులు, పెద్దలూ మరణించిన సందర్భాలలో సంతాప సూచికంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలి. జాతీయ పతాకం వాడుకలో ఈ నియమాలన్నీ ప్రతి భారతీయుడూ విధిగా, బాధ్యతగా పాటించాలి. జైహింద్..!

స్వాతంత్ర్యోద్యమ వేడుకలను ఆగస్టు 15 నుండి మళ్లీ వచ్చే ఆగస్టు 15 వరకు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఒక్కరే విడిగా చేసుకోవచ్చు.

అందరూ కలసి ఒకేసారి చేసుకోవచ్చు. అందరూ కలసి ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఒకే రోజు చేసుకున్నవారు కూడా అదే రోజు మళ్ళీ చేసుకోవచ్చు. సాధారాణంగా ఆగస్టు 15 రోజున పాఠశాల విద్యార్ధులు ఎటువంటి ఉత్సాహాన్ని చూపుతారో అదే ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరూ చూపాలి. అప్పుడే ఈ స్వాతంత్ర్య దినానికి నిండుదనం. అమరులకు అసలైన నీరాజనం.

Share this Story:

Follow Webdunia telugu