Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేల రాలిన ప్రజాస్వామ్య కుసుమం

Advertiesment
నేను తొలిసారి ప్రధానిగా ఎన్నిక కాబడినప్పుడు వాళ్ళు ఇలా అన్నారు
, శుక్రవారం, 28 డిశెంబరు 2007 (13:11 IST)
FileFILE
"నేను తొలిసారి ప్రధానిగా ఎన్నిక కాబడినప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, " పురుషుల స్థానాన్ని ఒక మహిళ కైవసం చేసుకుంది! ఆమెను తుద ముట్టించాలి... ఆమె దారుణంగా చంపబడాలి... ఆమె సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించింది..." తొలి ముస్లిం మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో, మత ఛాందసవాదుల వ్యాఖ్యలను ఊటంకించిన వైనమిది. చివరికి అదే సంభవించింది. దారుణమైన మానవ బాంబు దాడిలో ఆమె మరణించారు. ప్రపంచంలో అతి పిన్నవయస్సులోనే (35 ఏట) ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నేతగా బెనజీర్ భుట్టో చరిత్ర సృష్టించారు.

అలాగే.. ఇస్లామిక్ దేశానికి ప్రధానిగా ఎన్నికైన తొలి మహిళగా సైతం ఆమె పాక్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయారు. బెనజీర్ భుట్టో 1953 జూన్ 21వ తేదీన పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో జన్మించారు. విదేశాలలోని హార్వార్డ్ మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని స్వదేశానికి చేరుకున్న తరుణంలో ప్రజా ప్రభుత్వం బర్తరఫ్‌కు గురైంది. ఆమె తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టో 1970 కాలంలో పాక్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో పదవీచ్యుతులై జైలుపాలయ్యారు. అటు పిమ్మట 1979లో ఉరి తీయబడ్డారు.

అదేసమయంలో పిన్నవయస్కురాలైన బెనజీర్‌ను కూడా పలు మార్లు నిర్బంధించారు. చివరకు ఆమె దేశ బహిష్కరణకు గురైన బెనజీర్‌కు స్వదేశంలో ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పాలనే ఆకాంక్ష ఆమెలో బలంగా చోటు చేసుకుంది. అనంతరం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టి, ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి నేతృత్వం వహించేందుకు పాకిస్థాన్‌కు తిరిగివచ్చిన బెనజీర్ భుట్టో, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకమైన రీతిలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడంలో కీలక పాత్ర పోషించారు.

అంతేకాక 1988 నాటి పాకిస్థాన్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. తన పాలనలో పేదరిక నిర్మూలన మరియు అందరికీ ఆరోగ్యం తదితర అంశాలకు ఆమె పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సౌకర్యం, పాఠశాలలు నెలకొల్పడంలో ప్రధానిగా ఆమె చేసిన కృషి దేశ ప్రజల ప్రశంసలను చూరగొంది. ముస్లిం మతానికి చెందినప్పటికీ ఒక మహిళ ప్రధానిగా ఎన్నిక కావడాన్ని జీర్ణించుకోలేని ముస్లిం మత ఛాందసవాదులు, బెనజీర్ భుట్టోతో పలు పర్యాయాలు విభేదించిన సంఘటనలు కోకొల్లలు.

సైనిక మద్దతును కూడగట్టుకున్న పాక్ రాష్ట్రపతి గులాం ఇషాక్ ఖాన్ వివాదాస్పదమైన ఎనిమిదవ రాజ్యాంగ సవరణతో కేవలం 20 మాసాల వ్యవధిలోనే పార్లమెంటును రద్దు చేసి, పాక్ ప్రజలపై ఎన్నికలను రుద్దారు. 1993 సంవత్సరంలో రెండవ సారి ప్రధానిగా ఆమె తిరిగి ఎన్నిక అయ్యారు. అయితే పలు అవినీతి కుంభకోణాలు కారణంగా చూపి, ఎనిమిదవ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలతో రాష్ట్రపతి ఫారూఖ్ లెఘారీ, కేవలం మూడు సంవత్సరాల కాలవ్యవధిలోనే బెనజీర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అనంతర కాలంలో చోటు చేసుకున్న సైనిక తిరుగుబాటులో ఆమె మరోసారి దేశబహిష్కరణకు గురయ్యారు.

ఆ విధంగా 1988 నుంచి 1990 వరకు మరియు 1993 నుంచి 1996 మధ్యకాలంలో ఆమె రెండు సార్లు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. దేశబహిష్కరణకు గురైన బెనజీర్ భుట్టో, పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో కుదుర్చుకున్న లోపాయకారీ ఒప్పందంతో 2007 సంవత్సరం అక్టోబర్ 19న స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆమె రాక సందర్భంగా జరిగిన ర్యాలీపై మానవబాంబుల దాడితో 150 మంది మరణించారు. ఈ సందర్భంగా పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ఎమర్జెన్సీని విధించి అనంతరం అంతర్జాతీయ సమాజం తెచ్చిన ఒత్తిళ్లతో రెండు నెలల వ్యవధిలోనే ఎమర్జెన్సీని తొలగించారు. 2008 జనవరి ఎనిమిదిన సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాక్ ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల రణరంగంలో విజయం సాధించేందుకు యుద్ధప్రాతిపదికన బెనజీర్ భుట్టో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తన ప్రచారంలో భాగంగా 2007 డిసెంబర్ 27వ తేదీ సాయంత్రం రావల్పిండిలో ఎన్నికల సభలో ఆమె పాల్గొన్న సమయంలో ఆత్మహుతి దళ దాడి జరిగింది. ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడిన బెనజీర్ భుట్టోను రావల్పిండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారతీయ కాలమాన ప్రకారం సాయంత్రం 06:46 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు.

Share this Story:

Follow Webdunia telugu