ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. గత వైకాపా ప్రభుత్వంలో శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ఆయన ఈ నెల 27, 28వ తేదీల్లో తిరుమల పర్యటనకు వెళ్లాలని భావించారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి తిరుపతికి చేరుకుని, అక్కడ నుంచి అలిపిరి మెట్ల మార్గంలో కాని నడకన తిరుమలకు చేరుకుని, 28వ తేదీ శనివారం శ్రీవారిని దర్శనం చేసుకోవాలని భావించారు. కానీ, ఆయన పర్యటన చివరి నిమిషంలో అనూహ్యంగా రద్దు అయింది.
గతంలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశాయి. ఈ పరిస్థితుల్లో ఆయన తిరుమల పర్యటన చేపడితే పరిస్థితి మరింతగా దిగజారుతుందని భావించారు. అందుకే తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు.
మరోవైపు, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పోలీసు వర్గాలు కూడా హెచ్చరించాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా అనుమానాలు కలిగాయి. ఈ క్రమంలో జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన పర్యటన రద్దుకు గల కారణాలను ఆయన మీడియా ముందుకు వచ్చి వివరించనున్నారు.