Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ నాన్నకే సాధ్యం కాలేదు.. మద్యపానం ఎలా నిషేధిస్తారు జగన్?

జాతీయ ప్లీనరీ తెచ్చిపెట్టిన మహోత్సాహంలో వైకాపా అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబులాగే అలివిమాలిన హామీల జోలికెళుతూ భంగపాటుకు గురికానున్నారా.. అధికారమే ఆశయంగా సాగిన ప్లీనరీలో జగన్ ఎన్నో ప్రజాకర

మీ నాన్నకే సాధ్యం కాలేదు.. మద్యపానం ఎలా నిషేధిస్తారు జగన్?
హైదరాబాద్ , సోమవారం, 10 జులై 2017 (09:42 IST)
జాతీయ ప్లీనరీ తెచ్చిపెట్టిన మహోత్సాహంలో వైకాపా అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబులాగే అలివిమాలిన హామీల జోలికెళుతూ భంగపాటుకు గురికానున్నారా.. అధికారమే ఆశయంగా సాగిన ప్లీనరీలో జగన్ ఎన్నో ప్రజాకర్షక పథకాలు రైతుల సంక్షేమానికి సంబంధించిన పధకాలు సభాముఖంగా ప్రకటించారు. నిజంగా అవి అమలయితే దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రైతులంత అదృష్టవంతులు మరొకరు ఉండరనే చెప్పాలి. అయిదెకాల వరకు భూమి ఉన్న రైతులకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు, రైతుల ఖాతాలోకి 12,500 రూపాయలు, ఇలా వింటూనే రైతులు పండగ చేసుకునే తరహా ప్రకటనలు చేసి పడేశారు జగన్. తన తండ్రి వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జగన్ ఇంత బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చినట్లు స్పష్టంగా కనబడుతోంది. పాలకుడి మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది కాగితాలపై బ్రహ్మాండంగా పెట్టి మరీ చూపారు జగన్. నిజంగానే అధికార పార్టీ గుండెలదిరిపోయే పథకాల ప్రకటనలవి.
 
వైఎస్‌ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్ గుంటూరులో జరిగిన  ప్లీనరీ సమావేశాల్లో తొమ్మిది ప్రకటనలు చేసి వైఎస్ఆర్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వీటిలో చివరిదిగా.. అధికారంలోకి రాగానే మూడు దశల్లో పూర్తి మద్యపాన నిషేదం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతామని.. రెండో దశలో మద్యపానం వలన కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం తరపున క్యాంపైన్ నిర్వహిస్తామని.. చివరి దశలో మద్యంరేట్లను విపరీతంగా పెంచి కేవలం ఫైవ్ స్టార్, బార్‌లలో లభించే విధంగా చేస్తామని వాటివల్ల ఎక్కువ డబ్బు ఉన్న వాళ్లు మాత్రమే మద్యాన్ని తాగుతారని.. ఒకవేళ ఆరోగ్యం పాడైనా అమెరికా వెళ్లైనా వారు ట్రీట్ మెంట్ తీసుకోగరని అన్నారు.
 
అయితే తాను తీసుకున్న ఈ తాజా సంచలన నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినా పర్లేదని.. నిరుపేద కుటుంబాలు ఈ మద్యపానం వల్ల రోడ్డున పడుతున్నాయని వారిని ఆదుకోవడం కోసం తానీ ప్రకటన చేసినట్లు తెలిపారు జగన్.
 
కానీ ఈ పథకాలకు అయ్యే ఖర్చు, ఏపీ ఎకానమీ రెండింటినీ పోల్చి చూస్తే  జగన్ ఆ పథకాలకు అయ్యే వ్యయాన్ని ఎక్కడినుంచి తెస్తారు అన్నదే యక్ష ప్రశ్నలా తయారైంది. ఏపీ రైతులు బాగుపడాలంటే వైకాపా ప్రకటించిన పథకాలన్నీ అవసరమే. కానీ మద్యపానం కూడా పేదలకు అందుబాటులో లేకుండా చేస్తానంటూ భీకర ప్రతిజ్ఞ చేసిన  జగన్ ఏ సంక్షేమ పథకానికయినా డబ్బులు ఎక్కడినుంచి తెస్తారు. 
 
ఒక్క మద్యపానం వల్లే ఏపీలో సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయల రాబడి వస్తోంది. ఏ ప్రభుత్వమైనా మనగలగాలంటే ఇప్పుడు ఈ మద్యపానం మీద వచ్చే ఆదాయమే ముఖ్య వనరుగా ఉంటోంది. అలాంటి దాన్ని పేదలకు అందుబాటులో లేకుండా చేస్తానని, స్టార్ హోటళ్లలో మాత్రమే దొరికేలా, సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తామని జగన్ చేసిన ప్రకటన నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డే మద్యపానం జోలికి వెళ్లలేదు. దాని ప్రాధాన్యత, మతలబు తెలసిన వ్యక్తే కాబట్టి  పైకి ఎన్ని గంభీర ప్రకటనలు చేసినా వైఎస్‌ఆర్ తన హయాంలో మద్యపాన నిషేధం గురించి అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు లేదు.
 
ఒకవేళ జగన్ తాను కోరుకుంటున్నట్లుగా ఏపీలో అధికారంలోకి వస్తే మద్యపానంమీద చేయి వేయడం అసాధ్యమైన పని అని గత 40 ఏళ్ల రాష్ట్ర పాలకుల అనుభవం కనబడుతూనే ఉంది.
 
చంద్రబాబుకుపోటీగా ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి వైఎస్ జగన్ కూడా బాబులాగే పరువు పోగొట్టుకోవడానికి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారా?
 
సమాధానానికి 2019 వరకు వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ కోరుకుంటే.. మూడో దేశం కాశ్మీర్‌లో ప్రవేశించవచ్చు: చైనా కొత్త వాదన