Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విన్నపాలు వినవలే... ఢిల్లీలో బిజీబిజీగా ఏపీ సీఎం జగన్

Advertiesment
YS Jagan
, శుక్రవారం, 11 జూన్ 2021 (13:28 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో అత్యంత బిజీగా గడుపుతున్నారు. గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రెండో రోజైన శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో పాటు.. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం, నిధుల విడుదలకు సంబంధించి అనేక వినతి పత్రాలు అందజేశారు. 
 
కాగా, గురువారం రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలుసుకున్న జగన్.. దాదాపు గంటన్నరపాటు ఆయనతో చర్చించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్టణం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ గతేడాది చట్టాన్ని తీసుకొచ్చామని, కాబట్టి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తూ రీ నోటిఫికేషన్ జారీ చేయాలని అమిత్ షాను కోరారు. 
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా గ్రాంట్లు వస్తే రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. అలాగే, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.5,541.88 కోట్లను ఇప్పించాలని అభ్యర్థించారు. విశాఖలోని అప్పర్ సీలేరు రివర్స్ పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుకు అయ్యే రూ.10,445 కోట్ల వ్యయంలో 30 శాతం నిధులు సమకూర్చాలని కోరారు. 14, 15వ ఆర్థిక సంఘం బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఆ తర్వాత కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల అమలుపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని, రూ.55,656.87 కోట్ల పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరారు.
 
అలాగే, శుక్రవారం కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌లతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి అమరావతికి ప్రత్యేక విమానంలోనే తిరిగి వస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవాగ్జిన్ సరఫరాకు అనుమతి నిరాకరణ.. భారత్‌ బయోటెక్‌కు ఎదురుదెబ్బ!