వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 45 రోజులవుతోంది. కొత్త కొత్త పథకాలతో ప్రజల్లోకి జగన్ వెళుతున్నారు. అయితే గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ పూర్తిగా రద్దు చేసేశారు. జగన్ అమలు చేస్తున్న కొన్ని పథకాలను ప్రజలు కొంతమంది మెచ్చుకుంటుంటే మరికొంతమంది ఇబ్బందులు పడక తప్పదంటున్నారు.
ముఖ్యంగా ఎపిలో లోటు బడ్జెట్ ఎక్కువగా ఉంది. లోటు బడ్జెట్‌ను అధిగమించేందుకు గత ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం లోటు బడ్జెట్‌ను అధిగమించకపోగా అప్పులు మాత్రం బాగానే పెట్టారనే వాదన వుంది. దీంతో జగన్‌కు కష్టాలు వచ్చి పడ్డాయి. ఆ అప్పును తీర్చుకుంటూ మళ్ళీ అప్పులు చేసి ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్న జగన్ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
అందులో భాగంగా 25 శాతం కన్నా తక్కువ పూర్తయిన ప్రాజెక్టులు ఏది ఉన్నా సరే వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలిస్తున్నారు. అది సాగునీటి - తాగునీటి ప్రాజెక్టులయినా, ఇతర ఏ ప్రాజెక్టులయినా సరే. జిఓలను విడుదల చేసి ఆపేస్తున్నారు. ఎపిలో తాగు-సాగునీటి ప్రాజెక్టులు కూడా ఆపేయమన్నారు జగన్.
ఇప్పటికే నీటి సమస్య ఎపిలో ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులను ఆపేయమనడం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇది ఖచ్చితంగా నీటి సమస్యకు దారితీస్తుందని, అభివృద్థి కార్యక్రమాలను నిలిపేయడం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయే అవకాశం ఉందంటున్నారు. మరి చూడాలి జగన్ తాను తీసుకునే నిర్ణయాలపై పునరాలోచిస్తారో.. లేక అలాగే కొనసాగిస్తారో..