ఏసీలు, కూలర్లు వాడితే విద్యుత్ బిల్లు పెరగదా అంటూ వైకాపా ఎమ్మెల్యే మహిళలపై రుసరుసలాడారు. ఈ వ్యాఖ్యలు నంద్యాల జిల్లా శ్రీసైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేశారు. గతంలో విద్యుత్ బిల్లు రూ.200లోపు వచ్చేదని, ఇపుడు ప్రతి నెల రూ.600 నుంచి రూ.800 మేరకు వస్తుందంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పై విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
శనివారం బండిఆత్మకూరు మండలం ఈర్నపాడులో జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హాజరయ్యారు. ఇందులో ఆయన ప్రసంగిస్తుండగా, ఓ మహిళ లేచి విద్యుత్తు బిల్లులు ప్రతినెలా పెరుగుతున్నాయని వాపోయారు. దీనికి ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడుతూ 'సీఎం జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలతో ఏసీలు, కూలర్లు కొంటున్నారు. వాటివల్లే ప్రతినెలా బిల్లులు అధికంగా వస్తున్నాయి' అన్నారు.
అలాంటి వస్తువులేవీ మా ఇంట్లో లేవని, అయినా బిల్లులు అధికంగా వస్తున్నాయని ఆ మహిళ వాపోయారు. పలువురు గ్రామస్థులు తమ సమస్యలు తెలిపేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే వారిని వారిస్తూ, చిరాకు ప్రదర్శించారు. జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడితే విద్యుత్తు బిల్లులు పెరగవా అంటూ మరోమారు ప్రశ్నించారు.