Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పటేల్ సేవలు అజరామరం: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

Advertiesment
పటేల్ సేవలు అజరామరం: గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
, ఆదివారం, 31 అక్టోబరు 2021 (17:51 IST)
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారత దేశానికి అందించిన సేవలు మరువరానివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గౌరవ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటామని,  దేశానికి సర్దార్ పటేల్ అందించిన సేవలను భారతీయులు ఎన్నటికీ మరచిపోరని అన్నారు.

 
స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 556 సంస్థానాలు స్వతంత్రంగా ఉండటానికి కుట్ర పన్నిందని, ఆ సమయంలో భారతదేశ ఉక్కు మనిషిగా ప్రసిద్ది గాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తన ధృఢ సంకల్పంతో ఈ రాష్ట్రాలన్నింటినీ భారతదేశంతో ఐక్యం చేయగలిగారని వివరించారు. ఇదే జరగకుంటే భారతావని విచ్ఛిన్నంగా ఉండేదని గవర్నర్ అన్నారు.

 
సంస్ధానాల విలీన ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు వచ్చినా, ఆనాడు ఉప ప్రధాని, హోం మంత్రి ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి అఖండ భారత నిర్మాణానికి మూల స్ధంభంగా నిలిచారని కొనియాడారు. పటేల్ వ్యూహాత్మక వైఖరే అన్ని రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేయడానికి దారితీసిందన్నారు. హైదరాబాదు సంస్ధానం భారతదేశంలో విలీనమైన సమయంలో కూడా, నాటి నిజాం తమ ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకున్నాడని, సర్దార్ పటేల్ పోలీసు చర్యకు ఆదేశించటంతో తలొగ్గక తప్పలేదని పేర్కొన్నారు.

 
హైదరాబాద్ నిజాంను లొంగిపోవాలని, విలీన ఒప్పందంపై సంతకం చేయాలని ఒత్తిడి చేయటం పటేల్ వల్లే సాధ్యం అయ్యిందని, ఆయన లేకుంటే హైదరాబాద్‌తో పాటు అనేక ఇతర సంస్థానాలు స్వతంత్ర దేశాలుగా మిగిలి ఉండేవన్నారు. ఒడిశాలో కూడా 26 రాచరిక రాష్ట్రాలు ఉన్నాయని, నాటి ముఖ్యమంత్రి హరేక్రిష్ణ మహతాబ్ ఆహ్వానం మేరకు ఒడిశా వచ్చిన పటేల్ మొత్తం 26 రాచరిక రాష్ట్రాల విలీనానికి కారణభూతులయ్యారని కొనియాడారు.

 
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఎత్తైన విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుజరాత్‌లో నెలకొల్పటం ముదావహమని, అది ఇప్పడు ఆ మహానేత గౌరవ చిహ్నంగా విరాజిల్లుతుందని స్పష్టం చేసారు. కార్యక్రమంలో గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్‌సీఆర్ పరిధిలోని 14 జిల్లాల్లో బాణాసంచా విక్రయాలపై నిషేధం