Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు అధర్మపోరాటం చేశారు : సుజనా చౌదరి

ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు అధర్మపోరాటం చేశారు : సుజనా చౌదరి
, ఆదివారం, 14 జులై 2019 (13:50 IST)
బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా విజయవాడకు వచ్చిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరికి అపూర్వ స్పందన లభించింది. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు బీజేపీ నాయకులు అఖండ స్వాగతం పలికారు. అక్కడి నుంచి వందలాది వాహనాల ర్యాలీతో విజయవాడలో వెన్యూ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సుజనా పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్, మాజీ యం.పి కె.హరిబాబు, జాతీయ కార్యదర్శి  వై.సత్య కుమార్, మాజీ మంత్రి  పైడికొండల మాణిక్యాలరావు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, జిల్లా అద్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ నగర అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వి.శ్రీనివాస్ రాజు, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు, పారిశ్రామిక వేత్త ముత్తవరపు మురళీకృష్ణ, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఈశ్వర రావు, బీజేపీ నాయకులు, లంకా దినకర్ వందలాది మంది అభిమానులు పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమంలో గోకరాజు గంగరాజు గారు మాట్లాడుతూ, టీడీపీ పార్టీ ఎన్డీయే నుండి బయటకు రావాలని భావించినప్పుడు సుజనా చౌదరి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీ నుండి బయటకు వెళ్లి చాలా తప్పు చేశారు అని అబిప్రాయపడ్డారు. మోడీ నాయకత్వం మీద ఆయనకున్న విశ్వసనీయత వల్లే సుజనా చౌదరి బీజేపీ పార్టీలో చేరారని తెలిపారు. సుజనా రావడం వలన రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడే అవకాశం ఉందన్నారు.
 
అనంతరం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ పార్టీలోకి వచ్చే సుజనా చౌదరికి స్వాగతం అని.. ఈయన రాకతో బీజేపీ పార్టీ మరింత బలపడుతుందన్నారు. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. కేంద్రం రాష్ట్రం సహకరించుకుంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అని.. కేంద్రంతో చంద్రబాబు నాయుడు ఘర్షణ వాతావరణం ఏర్పడిన తరువాత రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 
 
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సఖ్యతతో కలిసి వెళితే విభజన అంశంలు సాదించుకోవచ్చు అని సూచించారు. ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ మాట్లాడుతూ, సుజనా చౌదరిని పార్టీలోకి  ఆహ్వానిస్తున్నాం.. ఈయన రాకతో బీజేపీ రాష్ట్రంలో బలపడుతుంది అని నమ్ముతున్నా అని చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడించి 9 నెలలో అధికారం చేపట్టగా చంద్రబాబు నాయుడు పార్టీని భ్రష్టు పట్టించారు అని దుయ్యబట్టారు. మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు ఘర్షణ వాతావరణం ఏర్పరచుకొని దారుణంగా ఓటమి పాలయ్యారు అని.. మోడీపై దేశ వ్యాప్తంగా అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. 
 
ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం లో 20 శాతం ఓట్లు సాధించి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత కల్పించి గతంలో జరిగిన అవినీతిని గుర్తించి కేంద్రానికి రిపోర్ట్ పంపితే చంద్రబాబు నాయుడుని జైలుకు పంపడం తథ్యం అని.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. 
 
 
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, నేను బీజేపీ పార్టీలోకి రాకముందు పరోక్ష రాజకీయాలలో ఉన్నాను.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలోకిరావాలని భావిస్తున్నాను. రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని.. దేశానికి మోడీ, అమిత్ షాలు ఖ్యాతీని తెచ్చి పెట్టారు అన్నారు. స్వాతంత్ర భారతదేశంలో మొదటి నాలుగు సంవత్సరాలు మన రాష్ట్రానికి జరిగింత న్యాయం మరో ఏ రాష్ట్రానికి జరగలేదు అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటాలు పేరుతో అధర్మ పోరాటాలు చేశారన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని మేము పార్టీలోకి రావడం జరిగింది అని.. రాబోయే కాలంలో అధికారంలోకి రావడం ఖాయం అని భరోసా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాన్ కార్డుల ప్రక్షాళనకే ఆధార్‌తో అనుసంధానం