విజయవాడకు చెందిన గుంటూరు కస్తూరి వైద్య కాలేజీ పీజీ విద్యార్థిని దేవీ ప్రియాంక (25) ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ప్రధాన నిందితుడు నవీన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
గతేడాది డిసెంబరు 31న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దేవీ ప్రియాంక.. తన చావుకు నవీనే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నవీన్‌ను గుర్తించారు. పైగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ కూడా పీజీ జనరల్ సర్జన్ చేస్తున్నట్టు తెలుసుకున్నారు.
అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించారు. వారి కళ్లుగప్పి తిరుగుతున్న నవీన్ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ అతడికి ఎదురుదెబ్బ తగలడంతో మరో మార్గం లేక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించింది.