విజయవాడలో బాంబు కలకలం రేగింది. కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబ్ ఉన్నట్లు బెదిరించాడు. ఫోన్ చేసిన ఓ అజ్ఞాత వ్యక్తి.. విజయవాడ బీసెంట్ రోడ్డులో బాంబులు పెట్టామని, మరికాసేపట్లో అవి పేలే అవకాశం ఉందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
బీసెంట్ రోడ్‌లోని షాపులు, తోపుడు బండ్లను బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబ్ ఉన్న ఆనవాళ్లు లేక పోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎలాంటి బాంబు లేకపోవడంతో నేటి మధ్యాహ్నం నుంచి యధావిధిగా బీసెంట్ రోడ్‌లో వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు పోలీసులు. అలాగే కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్‌కాల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.