తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణ కోసం వాహనాల వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్‌లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత వేగం నిబంధనను ఉల్లంఘించే వాహనాలను స్పీడ్ గన్‌ల ద్వారా గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం అధికారులతో ఆయన వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భారీ వర్షాలకు దెబ్బతిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డు, శ్రీవారి మెట్టు మరమ్మతు పనులను త్వరలో పూర్తి చేయాలన్నారు. ఘాట్ రోడ్లలో డ్రోన్ల ద్వారా గుర్గావ్‌కు చెందిన భూమి డెవలపర్స్ సంస్థ నిర్వహించిన జియలాజికల్ సర్వే, టోపోగ్రఫి సర్వే నివేదికలను జనవరి 10 లోగా అందించాలన్నారు.
ఈ నివేదికలను అమృత యూనివర్సిటీలోని నిపుణులకు పంపి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మోకాలిమెట్టు నుంచి జిఎన్‌సి వరకు ఒకటో ఘాట్ రోడ్డు నాలుగు లైన్లుగా విస్తరించే పనులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్నమయ్య మార్గం అభివృద్ధిపై ఈవో అధికారులతో చర్చించారు.
ఈ సమావేశంలో జెఈవో వీరబ్రహ్మం, సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి, ఎఫ్ఏ సీఎవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, భూమి డెవలపర్స్ సంస్థ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.