గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీ 140 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
కాగా, రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకున్న తర్వాత వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో గత ఫిబ్రవరి 16వ తేదీన ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఆయన జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన.. తన అరెస్టుపై న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. తాజాగా ఇళ్ళపట్టాల కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన నూజివీడు న్యాయస్థానం, షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలకు మార్గం ఏర్పడింది.
కాగా, వల్లభనేని వంశీ విడుదల నేపథ్యంలో విజయవాడ జైలు వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన భార్య పంకజ శ్రీతో పాటు వైకాపా ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు పేర్ని నేని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా భారీగా చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.