Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'స్మార్ట్ సిటీ' అమరావతికి రూ.496 కోట్లు

'స్మార్ట్ సిటీ' అమరావతికి రూ.496 కోట్లు
, బుధవారం, 27 నవంబరు 2019 (17:51 IST)
స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద రాజధాని అమరావతికి ఇప్పటి వరకు 496 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 
 
స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద ఎంపికైన రాజధాని అమరావతి కోసం 2017-18 నుంచి ఇప్పటి వరకు కేంద్రం 496 కోట్ల రూపాయలు విడుదల చేయగా ఆ మొత్తంలో 472 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కింద ఎంపికైన విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాలకు విడుదల చేసిన నిధుల గురించి ఆయన వివరించారు. 
 
2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు విశాఖపట్నం నగరానికి రూ.299 కోట్లు, తిరుపతికి రూ.196 కోట్లు, కాకినాడకు రూ.392 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి విడుదలైనట్లు మంత్రి తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 నగరాల అభివృద్ధి కోసం మొత్తం 23,054 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటి వరకు 18,614 కోట్ల రూపాయలను వివిధ నగరాలకు విడుదల చేసినట్లు చెప్పారు.
 
స్మార్ట్ సిటీస్ మిషన్‌ను వేగవంతంగా అమలు చేయడంలో ఎదురవుతున్న ఆటంకాల గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ మిషన్‌ను హడావిడిగా అమలు చేయడం తమ లక్ష్యం కాదని అన్నారు. మిషన్‌ కింద అమలు చేసే వివిధ ప్రాజెక్ట్‌లు నాణ్యతాపరంగా అత్యత్తమంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. స్మార్ట్‌ సిటీస్‌ ఎంపిక తర్వాత స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీల ఎంపిక, మానవ వనరుల సమీకరణ, డీటెల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ల రూపకల్పన అనంతరమే ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. 
 
ఈ ప్రక్రియలు పూర్తి కావడానికి తగినంత కాల వ్యవధి అవసరముందని చెప్పారు. గడచిన ఏడాదిగా మిషన్‌ అమలును వేగిరపరచగలిగామని అన్నారు. కేటాయించిన నిధులను ఆయా నగరాలు వినియోగించే వేగం కూడా 9 రెట్లు పెరిగిందని అన్నారు. మార్చి 2018 నాటికి కేవలం 1000 కోట్లు వినియోగిస్తే నవంబర్‌ 15, 2019 నాటికి అది 9497 కోట్ల రూపాయలకు పెరిగిందని మంత్రి వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమంగా మద్యం సరఫరా.. వైకాపా నేతల అరెస్టు