ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తి ఎక్కడికి వెళ్లినా, అది ప్రజల తరపున వెళ్లినట్టేనని, ఎందుకు వెళ్లారు, ఏమి చేశారనే వివరాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకుడిపై ఉంటుందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టంచేశారు.
ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ప్రజలసొమ్ముతో అట్టహాసంగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి, తన పర్యటనతో రాష్ట్రప్రయోజనాలను ఎంతవరకు నెరవేర్చారో, మంత్రులతో చర్చించిన అంశాలేమిటో బహిర్గతం చేయకపోతే ఎలాగని మాజీమంత్రి ప్రశ్నించారు. ప్రత్యేకహోదా, వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇస్తానన్న నిధులు, పోలవరం వంటి అంశాలపై జగన్ చర్చించి ఉంటే, ఆ వివరాలను ఎందుకు వెల్లడించలేదన్నారు.
తనపై ఉన్న కేసులు ఉచ్చు, బిగుసుకుంటున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లొచ్చాడని, దానితో పాటు సొంతబాబాయి హత్యకేసు విచారణ వేగంగా సాగుతుండటంతో, తనప్రమేయం, తనవారి వ్యవహారం బయటకు వస్తాయన్న భయంతోనే ఆయన అమిత్ షాతో భేటీ అయ్యాడని సత్యనారాయణ మూర్తి ఆక్షేపించారు.
బాబాయి హత్యకేసు విచారణ మరికొంతకాలం సాగదీసేలా సీబీఐని ఆదేశింపచేసేందుకే, జగన్ అమిత్ షాను కలిశాడని ప్రజలంతా కూడా అనుకుంటున్నారన్నారు. నేరాలుచేసి, జైలుకు వెళ్లొచ్చి, బెయిల్ పై తిరుగుతున్న వ్యక్తులు, మూడో వ్యక్తి లేకుండా డైరెక్ట్ గా కేంద్రహోంమంత్రిని కలవడం ఏమిటన్న బండారు, దానిపై అమిత్ షా కూడా ఆలోచన చేయాలన్నారు.
జగన్, అమిత్ షాల కలయిక, చర్చల వివరాలను కేంద్రహోంశాఖ కార్యాలయం తక్షణమే బయటకు వెల్లడించాలని బండారు డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా వస్తే, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయన్న జగన్మోహన్ రెడ్డి, ఆ అంశాన్ని కేంద్రంతో చర్చించాడో లేదో తెలియచేయాలన్నారు.
రాష్ట్రంలో హిందూమతంపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, స్వామీజీలు, పీఠాధిపతులు హైందవమతం కోసం పోరాడుతున్నారని, వారికి ఏమాత్రం రక్షణ కల్పించని ప్రభుత్వం, శారదాపీఠం స్వామీజీకి పోలీస్ రక్షణ ఎందుకు కల్పించారో సమాధానం చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలు రోజా, మల్లాదివిష్ణు, వైసీపీనేతలు ఇతర స్వామీజీలు, మఠాధిపతులను బహిరంగంగానే బెదిరిస్తున్నారని, వారికి లేని రక్షణ, స్వరూపనందకే ఇవ్వడం ఏమిటన్నారు. ప్రభుత్వంలోని అధికారులు, రిటైర్డ్ అధికారులు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించని ప్రభుత్వం, పీఠాధిపతులు, స్వామీజీలకు ఎందుకు ఇస్తోందన్నారు.
శారదాపీఠం స్వామీజీకి ఇచ్చిన భద్రతనే, ఇతర స్వామీజీలు, పీఠాధిపతులకు కూడాకల్పించాలని బండారు డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు, స్వామీజీలు, పీఠాధిపతులను బెదిరించడం, హిందువులను అవమానించడం వంటి చర్యలు ఎంతమాత్రం మంచిదికాదని ఆయన హితవుపలికారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నిమతాలనుసమానంగా చూశారని, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకతో పాటు, జెరూసలేం, మక్కా వెళ్లేవారికి ప్రభుత్వంనుంచి ఆర్థికసాయం కూడా చేయడం జరిగిందన్నారు.