మే 27 నుంచి రెండు రోజుల పాటు జరిగే టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికి సంబంధించిన కీలక సమస్యలపై తీర్మానాలను ఆమోదించే రెండు రోజుల సదస్సులో భారీ స్థాయిలో టీడీపీ కార్యకర్తలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
వివిధ దేశాల నుండి ఎన్టీఆర్ మద్దతుదారులు కూడా ఈ మహానాడులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ అడవి రాముడు మే 28న 100 స్క్రీన్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. మే 27న రాజమహేంద్రవరం శివార్లలోని వేమగిరిలో మహానాడుకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు రెండు రోజులూ మహానాడు క్యాంపస్‌లోని వారి కేరవాన్‌లలో బస చేసి పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ వేడుకలను పురస్కరించుకుని కాకినాడ నగరంలోని టీడీపీ మద్దతుదారులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బకింగ్‌హామ్ కెనాల్‌లో బోటు ర్యాలీ చేపట్టారు.
పన్నుల పెంపు, వ్యవసాయ పంట రుణాల విడుదలలో వైఫల్యం, మహిళలపై అఘాయిత్యాలు, నేరాల సంఖ్య పెరగడం వంటి తదితర అంశాలపై తీర్మానాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది.
నిరుద్యోగం, అభివృద్ధి లేమి, సహజ వనరుల దోపిడీ, భూ ఆక్రమణలు, ఇసుక మాఫియా, గంజాయి, డ్రగ్స్ వ్యాపారం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విడుదలలో జాప్యం, రుణాలు అప్పులు వంటి అన్ని ప్రధాన సమస్యలపై మహానాడు వేదికపై నుంచి వైకాపా సర్కారును ఏకేసేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది.