Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతిని రక్షించుకోలేక పోతే అంధకారమే : చంద్రబాబు ట్వీట్

అమరావతిని రక్షించుకోలేక పోతే అంధకారమే : చంద్రబాబు ట్వీట్
, సోమవారం, 1 నవంబరు 2021 (14:25 IST)
అమరావతి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రైతులు ‘మహా పాదయాత్ర’ను తలపెట్టారు. ఇది సోమవారం నుంచి ప్రారంభమైంది. 
 
‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో సాగే ఈ యాత్ర తుళ్లూరులో ప్రారంభమై తిరుపతి వరకు కొనసాగనుంది. మొత్తం 45 రోజుల పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగనుంది. 
 
ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయ నేతలు పాల్గొంటున్నారు. అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు ఈ మహా పాదయాత్రకు మద్దతు తెలిపాయి. 
 
ఈ పాదయాత్ర సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ట్వీట్ చేశారు. 'ప్రజా రాజధాని అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నా. ఇది పాదయాత్ర కాదు, రాష్ట్ర పరిరక్షణ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమితల్లి వారసులు చేస్తున్న ఉద్యమం. 
 
1999లో విజన్ 2020తో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం. విభజన అనంతరం విజన్ 2029లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అమరావతితో పాటు నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికాం. ఓ వైపు విజన్ 2020 ఫలితాలు చూసి సంతోషం కలుగుతున్నా… మరో వైపు విజన్ 2029 ప్రణాళికల అమలుపై గొడ్డలి వేటుతో బాధ కలుగుతోంది. 
 
అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం. అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారమవుతుంది. తెలుగుదేశం శ్రేణులు, ప్రజలు, ప్రజాసంఘాలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతిఒక్కరూ ఈ మహా పాదయాత్రకు మద్దతు తెలపాలి. 5 కోట్ల ప్రజల గుండె చప్పుడు…  తెలుగుజాతి అఖండజ్యోతి అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది' అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవాగ్జిన్‌కు శుభవార్త - ఆస్ట్రేలియా గుర్తింపు