బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోమారు తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆర్థిక సాయంతో ఓ చిన్నారికి ప్రాణంపోశారు. పసిపాప గుండె ఆపరేషన్‌కు సోనూసూద్ ఆర్ధిక సహాయం చేసినట్లు జనవిజ్ఞాన వేదిక కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.రాంప్రదీప్, తిరువూరు శాఖ కార్యదర్శి ఎల్.గంగాధర్ తెలిపారు.
కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన గాయత్రి అనే ఏడాది పాప గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతోంది.
దీంతో ఆ పాప ఆపరేషన్‌కు ఆర్థిక సహాయం చేయాలని జనవిజ్ఞాన వేదిక నుండి తాము సోనూసూద్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశామని తెలిపారు.
ఆ పాప గుండె ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు భరిస్తానని సోనూసూద్ తన వ్యక్తిగత కార్యదర్శి గోవింద్ అగర్వాల్ ద్వారా మంగళవారం తమకు తెలిపారని పేర్కొన్నారు. సోనూసూద్ సహాయం పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు.