Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింహాచ‌లం అప్ప‌న్న ఆల‌యంలో వరాహ పుష్క‌రణీ అభివృద్ధి

సింహాచ‌లం అప్ప‌న్న ఆల‌యంలో వరాహ పుష్క‌రణీ అభివృద్ధి
విజయవాడ , శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:51 IST)
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ప్రసాద్' పథకంలో భాగంగా సింహాచలం దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రూపొందించిన ప్రణాళికలను కేంద్రం నుంచి టూరిజం అండర్ సెక్రటరీ ఎస్. ఎస్. వర్మను ప్రాజెక్టు పరిశీలనకు పంపించినందుకు కేంద్ర మంత్రికి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. సింహాచలం దేవస్థానం అభివృద్ధికి గతంలోనే ప్రతిపాదనలు పంపించినా కరోనా పరిస్థితుల వల్ల ఆలస్యమైందని మంత్రి అన్నారు. దేవస్థానం అభివృద్ధి పనుల నిమిత్తం 70 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా 55 కోట్లు మంజూరయ్యాయని మంత్రి అన్నారు.

మాధవధార నుంచి ఉన్న సింహాచలం మెట్ల మార్గాన్ని పునరుద్ధరించి భక్తులకు వినియోగంలోకి తెస్తామన్నారు. గతములో ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం అండర్ పాస్ నిర్మాణం చేపట్టదలచినా చినజీయర్ స్వామి సలహా మేరకు విరమించుకున్నామని.. అందుకే మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని అన్నారు.

పుష్కరిణి అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం స్నాన ఘాట్ల నిర్మాణం, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, లైటింగ్, ల్యాండ్ స్కేప్ అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయంలో యజ్ఞశాల నిర్మించి యాగాలు జరిగేలా చూస్తామన్నారు. శనివారం, ఏకాదశి, చందనోత్సవం వంటి పుణ్య తిధుల్లో ఆలయానికి భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. తిరుమల తరహాలో క్యూ కాంప్లెక్స్ ను విస్తరిస్తామని అన్నారు.

భక్తుల సౌకర్యం కోసం తిరుమల తరహాలో 2వేల మందికి సరిపడా వెయిటింగ్ హల్ నిర్మాణం చేపడతామన్నారు. ఆలయం దిగువన కూడా ఈతరహా వెయిటింగ్ హల్ నిర్మిస్తామన్నారు. గురుపూర్ణిమ రోజున అరుణాచలం తరహాలో సింహాచలం కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షణ చేసేందుకు మట్టి రోడ్డు( ట్రాక్) ఏర్పాటు చేస్తామన్నారు.

ఇందుకు సంబంధించి కొండ చుట్టూ ప్రాంతాన్ని ఉన్నతాధికారులు పరిశీలించనున్నారని అన్నారు. ఈ పనులన్నీ త్వరలోనే ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈక్రమంలోనే రాష్ట్రంలోని శ్రీశైలం, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం, అన్నవరం, ఆరసవిల్లి సూర్య దేవాలయంతోసహా పలు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలను 'ప్రసాద్' స్కీమ్ లో భాగంగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు.

రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, లేఖ రాసిన వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. సింహాచలం ఆలయ అభివృద్ధికి, సైట్ పరిశీలనకు, అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర టూరిజం శాఖ అండర్ సెక్రటరీ ఎస్. ఎస్. వర్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రణాళికలు పరిశీలించి టూరిజం శాఖ ఇచ్చే అనుమతులతో తొలివిడతలో పనులు ప్రారంభిస్తామని అన్నారు.

ఈ సమావేశంలో ఏపీ టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.ఎల్.మల్లా రెడ్డి రెడ్డి, సింహాచలం దేవస్థానం ఈఓ సూర్యకళ, అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు , టూరిజం సీఈ మూర్తి, రీజనల్ డైరెక్టర్ కె.రమణ, డివిజనల్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిథి బృందం పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమలాపురంలో అమీర్ ఖాన్...లాల్ సింగ్ చ‌ద్దా మేకింగ్