ఏపీలోని విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించిన సఖినేటిపల్లి మహిళా ఎస్‌ఐ కె.భవాని వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఆమె గదిలో, ఫోన్‌లో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే, పీటీసీలో ఆమె బస చేసిన గదిలోని ఓ పుస్తకంలో మాత్రం ఈ రోజు చనిపోతున్నా అని రాసి ఉందని, దాన్ని స్వాధీనం చేసుకున్నామని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.
కాగా, ఇటీవల ట్రైనీ ఏఎస్ఐ కె. భవాని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. పోలీస్ ట్రైనింగ్ హాస్టల్ రూమ్‌లో ఉరివేసుకొని చనిపోయింది. ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆదివారం భవాని సొంత జిల్లాకు వెళ్లాల్సివుంది. కానీ, అమె ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత తాను బస చేసిన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
అయితే, 2018 బ్యాచ్ కి చెందిన కె. భవాని, రాజోలులో ట్రైనీ ఎస్సై పనిచేశారు. తాజగా ఆమెకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పీఎస్‌లో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టేందుకు వారం ముందు విజయనగరం ట్రైనింగ్ స్టేషన్‌లో శిక్షణ నిమిత్తం ఉంచారు. ఈ నేపథ్యంలోనే భవాని ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెం గ్రామం.