Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేంద్ర మోడీతో ఆ అనుబంధమే కిషన్ రెడ్డిని అందలం ఎక్కించిందా?

Advertiesment
kishan reddy
, గురువారం, 8 జులై 2021 (16:49 IST)
సౌమ్యుడు, నిజాయితీ కలిగిన నేతగా ఉన్న కిషన్ రెడ్డికి మోడీ కేబినెట్లో ప్రమోషన్ దక్కింది. సహాయమంత్రి నుంచి కేబినెట్ హోదాకు చేరుకున్నారు. తెలంగాణాపై బిజెపి అధినాయకత్వం దృష్టి పెట్టడం.. అమిత్ షా, మోడీలకు సన్నిహితంగా ఉండడం కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎదగడానికి దోహదపడ్డాయి.
 
కార్యకర్త నుంచి కేంద్రమంత్రి వరకు ఎదగడం చిన్నవిషయం కాదు. ఎన్నో త్యాగాలు చేయాలి.. ఎంతో శ్రమపడాలి. ఎంతో కృషి చేయాలి.. ఇటు ప్రజలతో మమేకమై బలం పెంచుకుంటూ అటు పార్టీలో కూడా పట్టునిలుపుకోవాలి. అప్పుడే పదవులు వరిస్తాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేలిగ్గా అంతవరకు చేరలేదు.
 
దాని వెనుక ఆయన చేసిన త్యాగాలెన్నో ఉన్నాయి. మొదటి నుంచి ఆయన నిలుపుకున్న నిజాయితీ, నిబద్థత ఆయనకు ప్లస్ అవుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా, ఎంపిగా, కేంద్రమంత్రిగా ఏ స్థాయిలో ఉన్నా ఆయనలో కించెత్తు అహం కనిపించదు. అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంట్లో జనాన్ని అడిగితే కిషన్ రెడ్డి ఏంటో చెప్పేస్తారు.
 
అంతలా ఆయనకు మంచి పేరుంది. కేంద్రమంత్రిగా ఆయన కార్యస్థలం మరింతగా విస్తరించింది. బిజెపిలో కిషన్ రెడ్డిది సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం. 1964లో రంగారెడ్డి జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు కిషన్ రెడ్డి. జయప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో జనతాపార్టీలో యువ కార్యకర్తగా చేరారు.
 
17 యేళ్ళ వయస్సులో 1977లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత మూడేళ్ళకు 1980లో బిజెపి సభ్యత్వం తీసుకున్నారు. బిజెపిలో సామాన్య కార్యకర్తగా చేరి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన కిషన్ రెడ్డి రాష్ట్రస్థాయిలో ఎన్నో పదవులను అలంకరించారు. బిజెపి యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.
 
పార్టీ శాసనసభాపక్షనేతగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీకి అనేక విధాలుగా సేవలందించిన కిషన్ రెడ్డి ప్రజాప్రతినిధిగా తన హవా చాటారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కారు. 2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 
 
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో-2014లో రెండుసార్లు అంబర్ పేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. బిజెపి ఫ్లోర్ లీడర్‌గా తనదైన ముద్ర వేశారు. ఇక 2010 నుంచి 2014 వరకు ఎపి బిజెపి అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం.. ఆ వెంటనే లోక్ సభకు పోటీ చేసి గెలవడం కిషన్‌కు ప్లస్ అయ్యింది.
 
దీంతో మోడీ కేబినెట్లో మంత్రి వర్గంలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. అమిత్ షా అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించారు. అమిత్ షా అనారోగ్యంతో ఉన్న కాలంలో హోంశాఖను డీల్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్‌గా అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
 
జమ్ముకాశ్మీర్ పైన దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగడానికి కృషి చేశారు. రెగ్యులర్‌గా జమ్ముకాశ్మీర్‌ను సందర్సించేసేవారు. 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ చట్టసవరణ, ఈశాన్య రాష్ట్రాల్లో శరణార్థుల అంశంపై తనదైన పాత్ర పోషించారు. కరోనా మొదటి వేవ్‌లో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఇన్‌ఛార్జ్‌గా రాత్రి పగలు పనిచేశారు.
 
కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలా పనిచేశారు. ఈ దశలోను మందుల కొరత రాకుండా పనిచేశారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి వచ్చే విధంగా కృషి చేశారు. బీబీ నగర్, ఎయిమ్స్, గాంధీ, హాస్పిటల్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణాకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ప్రత్యేక శ్రద్థ వహించారు. 
 
కిషన్ రెడ్డి బిజెపి ప్రారంభం నుంచి పార్టీకి విశ్వసనీయంగా పనిచేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీని వీడలేదు. తెలంగాణాలో టిఆర్ఎస్ ప్రభంజనం వీస్తున్నా తట్టుకొని నిలబడ్డారు. అమిత్ షా, మోడీల నాయకత్వంపై అచెంచలమైన విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. 
 
ప్రధాన నరేంద్రమోడీతో కిషన్ రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బిజెవైఎం జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మోడీ, కిషన్ రెడ్డిల సన్నిహిత సంబంధాలు మెరుగుపడ్డాయి. సౌమ్యుడు, వివాదరహితుడిగా కిషన్ రెడ్డికి మంచి పేరుంది. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉండటమే కిషన్ రెడ్డికి ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జలవివాదంపై జగన్ కీలక వ్యాఖ్యలు : గాడిదలు కాస్తున్నావు చంద్రబాబూ?