ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీల మెంబర్లు ఖరారయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించిన శాసనసభ వాటిని మండలికి పంపింది. అయితే ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి నిర్ణయించింది.
సభ్యుల పేర్లు ఇవ్వాలంటూ గతంలో రాజకీయ పార్టీలకు లేఖ రాశారు మండలి ఛైర్మన్ షరీఫ్. ఇప్పుడు ఆ సెలక్ట్ కమిటీల్లోని సభ్యులను ఖరారు చేశారు. సీఆర్డీఏ రద్దు బిల్లుపై ఏర్పాటు చేసిన సెలక్ట్‌కమిటీ ఛైర్మన్‌గా మంత్రి బొత్స వ్యవహరిస్తారు.
సభ్యులుగా దీపక్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, శ్రీనివాసులు, మహ్మద్ ఇక్బాల్, వెంకటేశ్వరరావు, సోము వీర్రాజు ఉంటారు.
ఇక అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీకి బుగ్గన రాజేంద్రనాథ్ ఛైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా అశోక్‌బాబు, నారా లోకేష్, తిప్పేస్వామి, సంధ్యారాణి, గోపాల్‌రెడ్డి, లక్ష్మణరావు, మాధవ్ ఉంటారు. ఒక్కో సెలక్ట్ కమిటీలో 9 మంది ఉన్నారు.
ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీలకు పంపడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
ప్రస్తుతం అది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే మండలి మాత్రం ముందుగా నిర్ణయం తీసుకున్నట్లుగానే.. రెండు బిల్లులపై సెలక్ట్ కమిటీలను నియమించింది.
శానసమండలి రద్దు ఏకపక్ష చర్య: బీజేపీ
శానసమండలి రద్దు ఏకపక్ష చర్య అని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఈ విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలని సూచించారు. రాజధాని బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లినా ఆమోదం పొందుతాయన్నారు.
మండలిలో వివిధ అంశాలపై ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరుగుతాయని.. అలాంటి వ్యవస్థను రద్దు చేయవద్దని కోరారు. మరోవైపు వార్షిక బడ్జెట్ లో కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందనడం సరికాదన్నారు.
గతేడాది 60 వేల కోట్లు వచ్చాయని.. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపితే గ్రాంట్స్ వస్తాయని అన్నారు.