Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కడతారు : సజ్జల రామకృష్ణారెడ్డి

సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కడతారు : సజ్జల రామకృష్ణారెడ్డి
, శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:33 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టంకడతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ జగన్‌ సర్కార్‌ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించింది. లబ్దిదారులకు ఖాతాలోకే సంక్షేమ పథకాల సొమ్ము జమ. 17న జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ అందరికీ ప్రధానమైన అంశం. 2019 ఎన్నికలు జరిగిన తర్వాత 22 నెలల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం జగన్‌ నేతృత్వంలో సమాజంలో మార్పులు తీసుకువచ్చే దిశగా ఎలా పని చేసిందో అందరికీ తెల్సు. 
 
ఆర్థిక సంక్షోభం దారుణంగా ఉన్నా, గత ప్రభుత్వం సృష్టించిన ఇబ్బందులు, వారు వదిలి పెట్టి పోయిన ఆర్థిక భారం, మరోవైపు కోవిడ్‌ మహమ్మారితో  ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో జనజీవనం స్తంభించింది. అయినా ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంది. ఇదొక పరీక్షా సమయం.  అయినా 20 నెలల్లో 13,14 నెలలు తీసి వేస్తే తక్కువ సమయంలోనే గుణాత్మక మార్పును జగన్‌ గారి సారధ్యంలో తీసుకు వచ్చాం. దీని కోసం కొత్త వ్యవస్థలైన వలంటీర్‌ వ్యవస్థలను, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం.
 
సంక్షేమ పథకాల్లోనూ కొత్త ఒరవడి తెచ్చి నేరుగా లబ్దిదారుల చేతుల్లోకి నయాపైస కోత లేకుండా తీసుకెళ్లాం. గతంలో లేని విధంగా శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ పథకాన్ని పొందే వెసులుబాటు కల్పించాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు, 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు పునాది వేయడం జరిగింది.  రియల్‌ టైంలో గణాంకాల చూస్తే ఈ ప్రభుత్వం ఎంత చేసిందో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించింది. గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేసే విధంగా 20 నెలల్లో జగన్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసి చూపింది. 
 
ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు ఈ ఉపఎన్నిక వచ్చింది. మా సభ్యుడి మరణంతో రాకూడని ఈ ఉపఎన్నిక వచ్చింది. ఇప్పుడు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి గురుమూర్తి పోటీలో ఉన్నారు. గత 15 రోజులుగా చూస్తే మా అభ్యర్థికి పోటీగా టీడీపీ, బీజేపీ - జనసేన అభ్యర్థులను పెట్టి ఆరోపణలు, విమర్శలు చేశారు. అయితే ఉప ఎన్నిక సందర్భంగా మా పార్టీ నాయకులు అందరి కంటే సీఎం జగన్‌ గారు ఈ ఎన్నికకు సంబంధించి ఎలా వ్యవహరించారో రాష్ట్రం మొత్తం చూడాలి. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ఓటర్లందరూ గమనించాలి.
 
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ ఎక్కడుంది. లోకేశ్‌ వల్లే టీడీపీ దివాళా తీసిందని చెప్పారు. అలాంటి అచ్చెన్నాయుడునే తన పక్కన కూర్చోపెట్టుకున్నారంటే అంత కంటే సిగ్గు ఉంటుందా? నేను, నా కొడుకే పార్టీ అని చంద్రబాబు చెప్పాలి. లేకపోతే షోకాజ్‌ నోటీసు ఇవ్వాలి. చంద్రబాబు, లోకేశ్‌ మీద విశ్వాసం లేదన్న రాష్ట్ర అధ్యక్షుడినే పక్కన కూర్చోపెట్టుకున్నారంటే.. వారికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేం. ఇలాంటి వారిపై జనం విశ్వాసం ఉంచాలా?. జోకర్లలోనూ తీసేసిన కేటగిరీ కింద ఉండేవారు మాకు ఓటేయండని అడగటం హాస్యాస్పదం. వేరే ఇతర కారణాలు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
 
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన రాళ్లదాడి హైడ్రామాను ప్రజలు గమనించారు. టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే స్వయంగా చెప్తున్నారు. లోకేశ్‌ దెబ్బకు టీడీపీ దివాళా తీసిందని ఆ పార్టీ నేతలే అంటున్నారని, దీన్నిబట్టి ఆ పార్టీ నేతలకి టీడీపీ పట్ల ఏమాత్రం చిత్తశుధ్ది ఉందో తెలిసిపోతుంది.
 
బీజేపీ నాయకులు కూడా పవన్‌ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థి అని ఒకసారి, మరోసారి కాదని ప్రచారం చేశాయి. ఇలాంటి నాన్‌ సీరియస్‌ పొలిటికల్‌ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక అధికారంలో ఉన్నవారిపై ఓట్ల ద్వారా తీర్పు వస్తుంది. పార్టీ పుట్టుక నుంచి ఇలాంటి రిఫరెండాలకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది. ఇదే రాజకీయం. అధికారంలోకి తీసుకొచ్చినా, నిలబెట్టినా వీటిని జగన్‌ గారు అర్థం చేసుకున్నారు. ప్రజల్లోకి వెళ్లి .. వారితో మమేకం అయ్యారు. ప్రజల సమస్యలపై స్పందించారు. ప్రజలకు హామీలు ఇచ్చి.. ఏమేమి చేస్తామో చెప్పారు. ఏవేవి చేశారో.. చేసి చూపించారు. దీనినుంచి పక్కకు వెళ్లింది ఏమీ లేదు. ఏ ఎన్నికలు వచ్చినా ఎప్పుడూ ప్రజలతోనే ఉన్నాం కాబట్టి ఎదుర్కొంటున్నాం. 
 
చంద్రబాబులా ప్రజల్ని తిట్టం. మీకు సిగ్గుందా. లేదా.. అనం. వారే అంతిమ నిర్ణేతలు. లోపం ఏమైనా ఉంటే మనలో ఉంటుంది. అదే నిబద్దతతో వైయస్‌ఆర్‌సీపీ ఉంది కాబట్టి.. దిగ్విజయంతో ముందుకు పోతున్నాం. ఈ ఉప ఎన్నిక ఒక గీటురాయి. స్థానిక నాయకులు తప్పుడు ఆరోపణలకు స్పందిస్తున్నారు తప్ప జగన్‌ గారు ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయటం లేదు. ఈ 20 నెలల్లో ప్రజలకు ఇవి చేశాం. ఇవి చేసే అవకాశం వచ్చింది. మీ ఆశీస్సులు ఇవ్వండని వినతితో ఒక లేఖ రాశారు తప్ప ప్రతిపక్షాలను ఒక్కమాట అనలేదు. 
 
జగన్‌ గారు ఏదో ఒక సీటు గురించి కాదు. రాజకీయాల్లో కొత్త ఒరవడి తెచ్చిన సంగతి విజ్ఞులైన ఓటర్లకు, రాజకీయాల్లో ఉన్నవారికి తెల్సు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు తప్ప.. ప్రజలకు సంబంధం లేని రాజకీయాలు నడపటం రాజకీయం కాదు. ప్రజలకు సంబంధించిన అంశాలపై సంబంధం ఉండాలి. దానికి ప్రజల ఆశీస్సులు కావాలి. మిగిలిన పార్టీలు కూడా ఇదే కాన్సెప్ట్‌తో వస్తే అదీ మంచిదే. పోటీ ఉంటే మాకూ మంచిదే. ప్రజలకు ఇది చేస్తామని చెప్పి చేయగలిగితే.. నిజాయితీ, చిత్తశుద్ధితో చేయటం అనేది కచ్చితంగా జరిగితేనే ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి. జగన్‌ చెప్పిన మాట తప్పడు. నేరుగా భరోసా ఇచ్చారు. 
 
ఇష్టంలేనివి చేయటం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. మావైపు నుంచి ప్రలోభాలు పెట్టుకోవటం ఉండకూడదని అధికారం సంబంధంలేని ఎన్నికలు. గతంలో ఎలాంటి ప్రలోభాలు వైయస్‌ఆర్‌సీపీ చేయలేదు. రేపు చేయదు. ఈ ఎన్నికల్లో గురుమూర్తికి, వైయస్‌ఆర్‌సీపీకి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రజల తీర్పు ఉండాలని ఆశిస్తున్నాం. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజలు వేసే ఓట్లు జగన్‌ గారికి ఆశీస్సులు. కోవిడ్‌ నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలి. వైయస్‌ఆర్‌సీపీ గెలుస్తుంది కాబట్టి మన ఓటు వేయకపోతే అనుకోకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసి జగన్‌ గారికి ఆశీస్సులు అందించాలి అని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వలంటీర్లు కాదు. ఉద్యోగులు ప్రజల్లో భాగం. వారు ఓట్లు వేస్తారు : సజ్జల