Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సంస్కరణలు

రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌  సంస్కరణలు
, సోమవారం, 14 అక్టోబరు 2019 (06:31 IST)
రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను, పారదర్శకతను పెంచే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖలో ప్రక్షాళనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల కమిషన్లు, ముడుపుల బాగోతాలతో అస్తవ్యస్తంగా వున్న రిజిస్ట్రేషన్స్‌ శాఖలో సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా తన డాక్యుమెంట్ ను తానే తయారు చేసుకుని, ఆన్ లైన్‌ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ కొత్త విధానాల ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో మరింత పారదర్శకత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

అంతేకాకుండా రిజిస్ట్రేషన్‌ రుసుమును కూడా ఆన్‌‌లైన్‌లో చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులు తమ పనుల కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితికి పూర్తి స్థాయిలో స్వస్తి చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో తమకు సంబంధించి క్రయ, విక్రయాలపై సొంతగా డాక్యుమెంట్‌‌ను తయారు చేసుకోవడంతో పాటు, దానిని రిజిస్ట్రేషన్ల శాఖకు అప్‌‌లోడ్‌ చేయడం ద్వారా టైం స్లాట్‌‌ను కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు.

సులభంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ
రాష్ట్రంలో ఇళ్లు, భవనాలు, వ్యవసాయ భూములు, నివాసస్థలాలకు సంబంధించి సేల్‌డీడ్‌, సేల్‌అగ్రిమెంట్‌, తాకట్టు రిజిస్ర్టేషన్‌, బహుమతి రిజిస్ర్టేషన్లు, జిపిఎ తదితర కార్యకలాపాలకు అనుగుణంగా నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్‌ లో పొందుపరిచారు.

వివిధ అవసరాలకు తగినట్లు దాదాపు 16 నమూనా డాక్యుమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ డాక్యుమెంట్ లలో క్రయ, విక్రయదారులు తమ వివరాలను నింపి వాటిని అప్‌ లోడ్‌ చేయాల్సి వుంటుంది. ఈ వ్యవహారం గతంలో డాక్యుమెంట్‌ రైటర్లు చేసేవారు.

ఇప్పుడు వారితో అసవరం లేకుండానే క్రయ, విక్రయదారులే నేరుగా చేసుకునే వీలు కల్పించారు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో నమూనాలను ఉపయోగించుకోవచ్చు. నమూనా పత్రంలో ఉన్న వివరాలు కాకుండా అదనపు అంశాలు వున్నా కూడా దీనిలో నమోదు చేసుకునే అవకాశం వుంది.

సిద్దం చేసుకున్న మొత్తం డాక్యుమెంట్‌ను ప్రింట్‌ తీసుకోవాలి. దానితో రిజిస్ర్టేషన కార్యాలయానికి వెళ్తే.. సదరు డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి, అధికారులు రిజిస్ర్టేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణాజిల్లాలో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు.

ఈ ప్రక్రియ అమలులో ఇబ్బందులను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని పలు లోపాలను అధికారులు గుర్తించి, వాటిని సవరించారు. నవంబర్‌ ఒకటో తేదీనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
రాష్ట్రప్రభుత్వం స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ శాఖ కమిషనర్‌ శ్రీ సిద్దార్ధాజైన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రెండు బృందాలను ఎంపిక చేశారు.

ఈనెల 14వ తేదీన కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న కడప, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం,  కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో న్యాయవాదులు, వైద్యులు, రియాల్టర్లు, బిల్డర్లు, పురప్రముఖులు, సాధారణ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. వారి నుంచి అవసరమైన సలహాలను, సూచనలను స్వీకరిస్తారు. 


తిరస్కరించే డాక్యుమెంట్లపై అప్పీల్‌‌కు అవకాశం
నూతన విధానం ద్వారా సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సమర్పించే డాక్యుమెంట్లను ఏదైనా కారణం వల్ల తిరస్కరిస్తే, దానిపై అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ చట్టం 73, 74 కింద జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చ.

ఏ కారణాల వల్ల డాక్యుమెంట్‌ ను తిరస్కరించారో సదరు అధికారి నిర్ణీత సమయంలో పూర్తి వివరణ అందిస్తారు. దీనివల్ల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ వేంకటేశ్వర స్వామినీ వదలని వైకాపా ప్రభుత్వం.. కంభంపాటి రామ్మోహన్‌రావు