ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో వున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలను కలిశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణాలు చేస్తామని గతంలో ఆ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలకు శ్రీకారం చుట్టారు.
సాలూరు, మక్కువ మండలం బాగుజోల గ్రామంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజనులతో ముఖాముఖి, ఫోటో ఎగ్జిబిషన్‌లను తిలకించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం కాలినడకన ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు.
జోరు వానలోనూ పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన సాగింది. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా తన సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసుకున్నారు పవన్ కల్యాణ్.
బాగుజోల, సిరివర మధ్య తారు రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన అనంతరం గిరిశిఖర గ్రామాల వైపు సుమారు కిలోమీటరు దూరం పవన్ కళ్యాణ్ కాలి నడకన చిలకల మాడంగి కొండపైకి ఎక్కారు.
సాలూరు రేంజ్ అటవీ అధికారులు గంజాయి సాగు నిర్మూలన, రవాణాను నిలువరించడంపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. గంజాయి నిర్మూలనకు అటవీశాఖ అధికారులు నిబద్దతతో పని చేయాలని సూచించారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం కృష్టా జిల్లా పర్యటనలో వున్నారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ బాలిక స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
గొడవర్రు రోడ్డులో పవన్ పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు.