ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. దీనిపై ఆయన స్పందించారు. 'మోడీ నాపై చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది.. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు. గాంధీనగర్‌లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తినిస్తుంది' అని అన్నారు. ప్రధాని మోడీని నేను తొలిసారిగా గాంధీ నగర్‌లో కలిశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయనతో ప్రతి సమావేశం ఎంతో సుహృద్భావ వాతావరణంలో జరిగేది. ప్రతి సమావేశం తర్వాత కూడా ఆయన పట్ల ఆరాధనా భావం కలిగేది. దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం అని అన్నారు.
ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డికి అదానీ ముడుపుల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారని... ఈ అంశంపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయని... అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయిన ఎర్రచందనాన్ని కర్ణాటకలో పట్టుకున్నారని... అలా పట్టుబడిన ఎర్రచందనం విక్రయాల్లో మన రాష్ట్ర వాటాపై కూడా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇప్పటికే మాట్లాడానని వెల్లడించారు.