Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

151 ఎమ్మెల్యేలదీ బూతు పురాణమే - సీఎం మారితే రాజధాని మార్చాలా? పవన్ కళ్యాణ్ గర్జన

Advertiesment
pawan kalyan
, ఆదివారం, 16 అక్టోబరు 2022 (12:07 IST)
వైకాపా ప్రభుత్వ పాలకులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు గర్జించారు. జనవాణి పేరుతో ఆయన విశాఖలో మూడు రోజుల పర్యటనకు శనివారం నుంచి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన ఆదివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారితే రాజధాని మార్చాలా అంటూ ప్రశ్నించారు. 
 
వైకాపా నేతలు మూడు రాజధానులపై కార్యక్రమం ప్రకటించడానికి కంటే మూడు రోజుల ముందే తాము విమాన టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నామన్నారు. తమ పర్యటనతో వైకాపా కార్యక్రమాన్ని భగ్నం, నిర్వీర్యం చేయాలనే ఆలోచన లేదన్నారు. ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటన, జనసేన కార్యకర్తల అరెస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తాము, తమ పార్టీ కార్యక్రమాలు నడిపే విధానం గురించి వైకాపా ఎలా చెబుతుందన్నారు. అసలు వాళ్లకి సంబంధమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యక్రమాలు ఎలా చేయాలో మేం చెబుతున్నామా? అని మండిపడ్డారు. 
 
'జనవాణి ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపించడం.. వాటిని సంబంధిత శాఖలు, మీడియా దృష్టికి తీసుకెళ్లడం. జనవాణి అంటే జనం గొంతు. అలాంటి కార్యక్రమం చేపడితే జనం గొంతు నొక్కేస్తామంటే ఎలా? ఇంతవరకు ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. 
 
ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకుని ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా విధానపరంగానే మాట్లాడుతుంటాం. వైకాపాకు 30 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎంతసేపూ బూతు పురాణం తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మా వద్దకు ఎందుకొస్తారు? 
 
భూ నిర్వాసితులు, పింఛన్లు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ యువత, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు.. ఇలా 3వేలకు పైగా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటిని సంబంధిత శాఖలకు తెలియజేశాం. వైకాపాకు పోటీగా ‘జనవాణి’ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఎన్నికల సమయంలోనే పోటీ.. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి  మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టాం. 
 
పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఆ శాఖపై ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉంటుంది. పోలీసులు నిర్ణయాలు తీసుకోరు.. ఏం తీసుకోవాలన్నది రాజకీయ నేతలే నిర్ణయిస్తుంటారు. శనివారం మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రజలు చూశారు.
 
మాపై పోలీసులు జులుం చూపుతూ వైకాపా ప్రభుత్వానికి అడ్డగోలుగా కొమ్ముకాశారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలీసులు ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి కింద ఈ పోలీసులు పనిచేస్తున్నారు. మీ పోలీస్ శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం. నేను బస చేసిన హోటల్‌ వద్ద వేకువజామున 3-4 గంటల వరకు పోలీసు అధికారులు తిరిగారు. 
 
గంజాయి దొంగలను వదిలేయండి.. దోపిడీదారులు, నేరస్థులకు కొమ్ముకాయండి.. సామాన్యుల గొంతు వినిపించే జనసేనను మాత్రం ఇలా ఇబ్బంది పెట్టండి. జనవాణి కార్యక్రమంలో గొడవ చేయాలనేదే వారి ఉద్దేశం అని ఆక్రోశించారు. 
 
ఈ పర్యటనలో మూడు రాజధానుల అంశం మా దృష్టిలో లేదు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలి. 2014లోనే కర్నూలునో, విశాఖనో నిర్ణయించి ఉంటే అదే ఉండేది. రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా? సీఎం మారితే రాజధాని మారిపోవాలా? 
 
నిజంగా మీకు ఉత్తరాంధ్ర, రాయలసీమపై అంత ప్రేముందా? రాయలసీమ నుంచి అంతమంది సీఎంలుగా వచ్చినా ఎందుకు ఆ ప్రాంతం వెనుకబడింది? అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టరెందుకు? ఉత్తరాంధ్ర నేతల్లో లేని వెనుకబాటుతనం ప్రజల్లోనే ఎందుకుంది? అంటూ పవన్ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒరిస్సా సీఎం సంచలన నిర్ణయం : 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు...