Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీలో చేర్చుకోవడమెందుకు.. నమ్మించి ఇలా గొంతు కోస్తారా? సన్నిహితుల వద్ద అంబటి రాయుడు వేదన

Ambati Rayudu

ఠాగూర్

, ఆదివారం, 7 జనవరి 2024 (13:26 IST)
ఏపీలోని అధికార వైకాపాలో చేరిన భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు.. సరిగ్గా పది రోజులు తిరగక ముందే ఆ పార్టీకి టాటా చెప్పేశారు. ఆయన బ్యాట్ పట్టకుండానే ఔట్ అయ్యాడు. అయితే, తనను నమ్మించి గొంతు కోశారంటూ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. 
 
గతంలో గుంటూరు లోక్‌సభ స్థానం టిక్కెట్ ఇస్తామని నమ్మించారు. పైగా, ఆ నియోజకవర్గం పరిధిలో తిరగాలని, అవగాహన వచ్చాక రాజకీయ ఉన్నతికి సహకరిస్తామని పార్టీ పెద్దలు నమ్మించారు. అప్పటి నుంచి ఆరు నెలల పాటు అంబటి రాయుడు జిల్లా అంతటా వ్యయప్రయాసలకోర్చి తిరిగారు. కాలక్రమంలో.. 'ఆడుదాం ఆంధ్రా' అంటూ గత నెలలో గుంటూరులోనే సీఎం ప్రారంభించిన కార్యక్రమానికి స్వతహాగా క్రీడాకారుడైన, పార్టీ పురోగతికి శ్రమిస్తున్న రాయుడికి ఆహ్వానం అందలేదు. 
 
అయినా ఆయన సర్దుకుపోయారు. గత నెల 28న ముఖ్యమంత్రే స్వయంగా కండువా కప్పి వైకాపాలో ఆయన్ను చేర్చుకున్నారు. అంతటితోనే ఆగలేదు.. గుంటూరు లోక్‌సభ స్థానం మీదేనని, అక్కడి నుంచి పోటీ చేయండని చెప్పారు. ముఖ్యమంత్రి హామీ లభించడంతో పోటీకి సంబంధించి రాయుడు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ.. శుక్రవారం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఆయనను ఈసారి గుంటూరు లోక్‌సభ స్థానానికి మారాలని సూచించారు. ఆయన ససేమిరా అనడంతో ఆలోచించుకుని రావాలని సీఎం పంపించారు.
 
'గుటూరు లోక్‌సభ టికెట్ నాదేనని నమ్మబలికి పార్టీలో చేర్చుకుని.. ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు సీఎం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? నాకు టికెట్ ఇవ్వాలనే ఆలోచనే లేకపోతే ఇస్తామని చెప్పడమెందుకు? పార్టీలో చేర్చుకోవడమెందుకు? నమ్మించి ఇలా గొంతు కోస్తారా?' అని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఈ నమ్మకద్రోహం నుంచి కోలుకోలేక రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 
 
'వైకాపా నుంచి క్విట్ చేయాలని నిర్ణయించుకున్నా.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా.. తదుపరి కార్యాచరణను రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని సామాజిక మాధ్యమంలో అభిప్రాయాన్ని వెల్లడించారు. తదుపరి కార్యాచరణను రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని పేర్కొన్నారు. స్పష్టత కోసం ఆయన ప్రయత్నించగా.. వైకాపా పెద్దల నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది. మొత్తంమీద అంబటి రాయుడు బ్యాట్ పట్టకముందే ఔటయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి ... ఎక్కడ?