ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీమంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాటాల్లోనే... నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా.. అక్రమాస్తుల కేసులో ఏ1 గారు అవినీతిపై కమిటీ వేశారు. ఏ2 విజయసాయిరెడ్డి గారు విచారణ చేస్తారట! కలికాలం కాకపోతే అక్రమాల విక్రమార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడటమా!! .
వైఎస్ గారి హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ రూ.14కి కొంటే, టీడీపీ హయాంలో రూ. 2.70 యూనిట్ కొన్నారు. మీ నాయనగారి నిర్వాకంతో డిస్కంలకు రూ. 8 వేలకోట్లు నష్టం వచ్చింది. ఈ ఉదాహరణలు చాలవా, ఎవరు మహామేతో! ఎవరు దార్శనిక నేతో తెలుసుకోడానికి.
అన్నయ్యలూ నాకేం తెలియదంటూనే ఎలాంటి విచారణ జరగకుండా, కనీస ఆధారాలు లేకుండా 2,636 కోట్లు అవినీతి జరిగిందని తేల్చారు. గుడ్డ కాల్చి వెయ్యడంలో మీకు మీరే సాటి వైఎస్ జగన్ గారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్తు నుండి మిగులు విద్యుత్తు సాధించి 5 ఏళ్లలో 150కి పైగా అవార్డులు సాధించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపాం. గడిచిన 5 ఏళ్లలో రూ. 36 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు అంటూ పెట్టుబడులు అడ్డుకొని రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని స్వయంగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ మీకు లేఖ రాసిన విషయం మర్చిపోయారా?
నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన మా అధినేత చంద్రబాబు గారిపై అవినీతి ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుందని నారా లోకేష్ ట్వీట్ చేయగా దీనికి రిప్లైగా ఓ నెటిజన్... ముందు కరెంట్ కోతలు లేకుండా చూడండి లేదంటే జనాలు మీ నాయకుల్ని తంతారు సీఎం గారు అంటూ ట్వీటాడు.