నాటు సారా తాగి 13 పది మంది చనిపోవడం అత్యంత విషాదమని, ఇవి ముమ్మూటికీ జగన్‌రెడ్డి సర్కారు హత్యలేనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.మద్యనిషేధం ముసుగులో 'జే ట్యాక్స్' వసూళ్ల కోసం విషంలాంటి బ్రాండ్లు 300 శాతం అధిక ధరలకు అమ్మడం జగన్‌రెడ్డికే చెల్లిందన్నారు. మద్యానికి బానిసైన నిరుపేదలు ఇలా సారా, శానిటైజర్లు తాగి మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లిక్కర్ కమీషన్ల కోసం నరహంతక ప్రభుత్వంగా మారి ప్రజల ప్రాణాలు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మద్యం వ్యాపారాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని, ఏపీలో డిస్టిలరీలు కూడా లీజుకి తీసుకుని మద్యం తయారు చేయిస్తూ, అమ్ముతూ వేలకోట్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
జగన్‌రెడ్డి, ఆయన బంధువుల డిస్టిలరీలలో తయారయ్యే ప్రమాదకరమైన మద్యం బ్రాండ్లు ఎంఆర్‌పీ కంటే మూడు రెట్లు అధికంగా ప్రభుత్వం పేరుతో ఉన్న జగన్‌రెడ్డి మద్యం దుకాణాల్లో అమ్ముతూ పేదల్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు.
డిస్టిలరీలు, బాట్లింగ్ కంపెనీలన్నీ తన బంధువులకు అప్పగించి, దుకాణాలన్నీ ప్రభుత్వం పేరుతో తన అదుపాజ్ఞల్లో పెట్టుకుని, వేలకోట్లు మద్యం అమ్మకాలు సాగిస్తూ దోపిడీకి పాల్పడటాన్ని మద్యనిషేధం అంటారని జగన్ రెడ్డి సర్కారు వల్లే తెలిసిందని ఎద్దేవ చేశారు.
కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నాటు సారా,శానిటైజర్ వంటి ప్రమాదకరమైనవి తాగి కురిచేడు,పామూరులో చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు వ్యవస్థలున్నా యథేచ్ఛగా సారా తయారు కావడం వెనుక ఉన్న అదృశ్యశక్తుల ఆట కట్టించాలని డిమాండ్ చేశారు.