తన ఇద్దరు చిన్నారులకు నిప్పంటించి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు సీఐ సోమయ్య, ఎస్సై రవినాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరుపాలెంకు చెందిన సుబ్బులు తన ఇద్దరు చిన్నారులతో కలిసి కర్ణాటకలోని బళ్లారి వద్ద వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. గురువారం బళ్లారి నుంచి ఈమె తన ఇద్దరు పిల్లలతో బయలుదేరింది.
శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరుపాలెం వద్ద దిగింది. గ్రామానికి వెళ్లే మార్గంలోఉన్న శ్మశాన వాటిక స్థలంలో తనతో పాటు పిల్లలపై శానిటైజర్ పోసి నిప్పంటించుకుంది. ఈ ప్రమాదంలో సుబ్బులు, కుమార్తె మధురవాణి(5) అక్కడికక్కడే మృతిచెందారు.
కుమారుడు మహేశ్ మంటల వేడికి తప్పించుకొని పరిగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మహేశ్ గ్రామంలోకి వెళ్లి చెప్పడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.