వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగున్నాయని టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. పైగా, ఆ స్థానానికి ఉప ఎన్నికలు ఎలా వస్తాయో కూడా విపులంగా వివరించారు.
ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారని, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని వెల్లడించారు. ఓ ఎమ్మెల్యే ముందస్తు సెలవు కోరకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేపై అనర్హత ఓటు వేడుతుందని రఘురామ తెలిపారు. అందువల్ల ఈ దఫా జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రానిపక్షంలో పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించి, ఉప ఎన్నిక నిర్వహించడం తథ్యమని తెలిపారు.
అయితే, జగన్ అసెబ్లీ సమావేశాలకు రావాలని, తన గళం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కాగా, గత ఎన్నికల్లో జగన్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండాపోయింది. కానీ, తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ పట్టుబడుతూ అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొడుతున్నారు. ఆయన బాటలోనే మిగిలిన వైకాపా సభ్యులు కూడా నడుస్తున్నారు.