Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శతకోటి లింగాల్లో బోడిలింగం... అనేక నానీల్లో ఒక నాని : 'గుడివాడ జంక్షన్‌'లో 'వకీల్ సాబ్' వార్నింగ్!

శతకోటి లింగాల్లో బోడిలింగం... అనేక నానీల్లో ఒక నాని : 'గుడివాడ జంక్షన్‌'లో 'వకీల్ సాబ్' వార్నింగ్!
, సోమవారం, 28 డిశెంబరు 2020 (18:37 IST)
కృష్ణా జిల్లా గుడివాడ జంక్షన్ వేదికగా వైకాపా నేతలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గట్టి హెచ్చరిక చేశారు. ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు.. గుడివాడ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొడాలి నానిలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సోమవారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. పవన్ రాకతో గుడివాడ జనసంద్రాన్ని తలపించింది. ఆయన రోడ్ షోకు విశేష స్పందన వచ్చింది. గుడివాడ నడిబొడ్డున (జంక్షన్)లో పవన్ కల్యాణ్ ప్రజానీకాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. 
 
భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు రూ.35 వేల చొప్పున పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే రూ.10 వేలు విడుదల చేస్తారా? నష్టపోయిన రైతులకు అసెంబ్లీ సమావేశాల్లోగా రూ.35 వేల పరిహారం ఇస్తారా? లేదా? రూ.35 వేల పరిహారం ఇవ్వకపోతే జనసేన కార్యకర్తలతో కలిసి నేను అసెంబ్లీని ముట్టడిస్తానంటూ హెచ్చరిక చేశారు. 
 
పైగా, అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో మేమూ చూస్తాం. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడినా తగ్గి ఉంటాం. నానా బూతులు మాట్లాడినా భరిస్తాం. మీరు రైతు కన్నీరు తుడవండి. రైతులకు న్యాయం చేయకపోతే వదలిపెట్టం. మీరు అసెంబ్లీ సమావేశాలు వైజాగ్‌లో పెడితే అక్కడకు వస్తాం. పులివెందులలో పెడితే అక్కడకూ వస్తాం. మీరు సై అంటే మేమూ సై. భయపడే ప్రసక్తే లేదు' అని తీవ్ర స్థాయిలో పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు.
 
ఆ తర్వాత మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'శతకోటి నానీల్లో ఒక నాని' అని ఎద్దేవా చేశారు. 'ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? నానీనా? వైసీపీలో నానీలు ఎక్కువమ్మా. ఏదో ఒక నాని. ఏ నానీనో నాకు అర్థం కావడం లేదు. గుర్తు కూడా లేదు. శత కోటి లింగాల్లో బోడి లింగం. అనేక నానీల్లో ఒక నాని. ఎవరైతే మనకేంటి? శత కోటి నానీల్లో ఒక నాని. ఏదో ఒక నాని...  మీ సీఎం సాబ్ జగన్ సాబ్‌కి వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి.
webdunia
 
తాను సినిమాలు చేయడాన్ని చాలామంది విమర్శిస్తున్నారని అన్నారు. పేకాట క్లబ్బులు నడుపుకుంటూ రాజకీయాలు చేసేవాళ్లున్నప్పుడు తాను సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు ఎందుకు చేయకూడదని నిలదీశారు. సిమెంటు ఫ్యాక్టరీలు నడుపుకుంటూ రాజకీయాలు చేసేవాళ్లున్నప్పుడు తాను సినిమాల్లో నటిస్తూ రాజకీయాలు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. 
 
'నన్ను విమర్శించే వాళ్లందరూ పాపం ఖద్దరు కట్టుకుని కేవలం రాజకీయాలే చేస్తుంటారు. కొల్లాయి ధరించి రాజకీయం తప్ప ఇంకే చేయరండి. వాళ్ల దగ్గర డబ్బులు కూడా లేవండీ పాపం. అనుక్షణం 'మా ప్రజలు మా ప్రజలు' అనుకుంటూ రోడ్లపై తిరుగుతుంటారు. వాళ్లు కేవలం ప్రజాక్షేమం కోసం రాజకీయాలు చేస్తుంటారు. ప్రజల కోసమే మీరు పనిచేస్తుంటే మీకు ఫ్యాక్టరీలు దేనికమ్మా! మీరు కాంట్రాక్టులు ఎందుకు తీసుకుంటున్నారు?
 
మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ వేల కోట్లు మీరు దోచేసుకోవచ్చు. నేను మాత్రం సినిమాలు చేసుకోకూడదా? మైనింగ్ కంపెనీలు, వ్యాపారాలు, మీడియా సంస్థలు అన్నీ మీకే ఉండాలా? మేం మాత్రం మీకు ఊడిగం చేయాలా? మీ దాష్టీకాలను భరించాలా? ఆ రోజులు పోయాయి. అవి పాత రోజులు. ఎదురుతిరిగే రోజులివి. ఇప్పుడు మీరు మా చొక్కా పట్టుకుంటే మేం మీ చొక్కా పట్టుకుంటాం' అంటూ తీవ్ర స్వరంతో వకీల్ సాబ్ హెచ్చరిక చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడి కోసం కాబోయే భర్తను చంపేసింది