Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌ 90 రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్‌.. టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి

Advertiesment
జగన్‌ 90 రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్‌.. టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి
, బుధవారం, 28 ఆగస్టు 2019 (08:43 IST)
వైఎస్ జగన్‌ 90 రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్‌ అయిందని వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఎందుకు తెచ్చుకున్నామా అనే భావనలోకి రాష్ట్ర ప్రజలు వచ్చారని, నిత్యం ఏదో ఒక చోట ఆందోళనతో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వ పరిపాలన పూర్తిగా స్థంబించిందని, జగన్‌ ప్రభుత్వానికి పాలనపై ప్రభుత్వానికి విధి విధానాలు లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రౌడీ రాజ్యం ఏలుతోందని కరుడు గట్టిన నేరస్థులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలవడంతోపాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హత్యా యత్నానికి ప్రయత్నం చేసిన కరడుగట్టిన నేరస్థుడు గంగిరెడ్డిని పెరోల్‌పై విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

రాష్ట్రంలో రోజు రోజుకు శాంతిభద్రతలు దిగజారుతున్నాయని బుచ్చయ్య చౌదరి ఆక్రోసించారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజల్లో భయాందోళనలు కలుగజేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో టీడీపీ నాయకులపై ఉన్న కేసులను తిరగదోడి ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విధివిధానాలు లేకపోవడంవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుంపడిందని, ఫలితంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధానిపై అనాలోచిత నిర్ణయాలు చేయడం ద్వారా అమరావతికి పెట్టుబడులు పెట్టేందుకు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడంలేదని, ఇప్పటికే ప్రపంచ బ్యాంకు సైతం వెనక్కి వెళ్లిపోయిందన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 2 వేల కోట్లే అవసరం కాగా, పెరిగిన అంచనాలకు ఆనాడు ఏ విధంగా వైఎస్‌ తండ్రి రాజశేఖర్‌రెడ్డి కాంట్రాక్టులిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

పీపీఏ సూచించిన ప్రకారమే పనులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడంపై బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పోలవరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టడంలో విఫలమైందన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాటం చేసి రాష్ట్రానికి నిధులు సాధించాలని బుచ్చయ్య చౌదరి సూచించారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిపై కూడా ఒక విధి విధానంతో ముందుకెళ్తే సమగ్రాభివృద్ధి జరుగుతుందే తప్ప వ్యక్తిగత ఎజెండాలు, సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తే రాష్ట్రం అధోగతి పాలవక తప్పదని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసేందుకే..! మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి