Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కియా పరిశ్రమ అభివృద్ధికి ప్ర‌భుత్వ స‌హ‌కారం: జగన్

Advertiesment
కియా పరిశ్రమ అభివృద్ధికి ప్ర‌భుత్వ స‌హ‌కారం: జగన్
, శుక్రవారం, 6 డిశెంబరు 2019 (07:57 IST)
కియా మోటర్స్‌ మరింత విస్తరించాలని, దేశీయంగా మరిన్ని చోట్ల కియా ప్లాంట్లు ఏర్పాటు చేసి ఏటా 3 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని, కియా పరిశ్రమ అభివృద్ధి కి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ఇండియా గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశీయంగా కార్ల ఉత్పత్తి ప్రారంభించిన కియా మోటర్స్‌ మరింత విస్తరించాలని, మరిన్ని చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేసి ఏటా 3 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

తద్వారా రాష్ట్రంలో మరెంతో మందికి ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. కియా మోటర్స్‌కు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అన్ని విధాలుగా తోడ్పాటు అందించడంతో పాటు కంపెనీకి సానుకూలంగా వ్యవహరిస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కియా సంస్థను అభినందించారు. సంస్థ పూర్తి స్థాయి ఉత్పాదక సామర్ధ్యానికి చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పుడు ఈ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కియా కంపెనీ బాటలో మరిన్ని విదేశీ కంపెనీలు భారత్‌కు తరలి రావాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో కియా మోటర్స్‌ సంస్థ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా మరో 7 వేల మందికి మొత్తంగా 18 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక్కడి సంస్థలో ఇప్పటికే 3 వేల మంది పని చేస్తుండగా, అనుబంధ విభాగాల ద్వారా మరో 3500 మందికి ఉపాధి లభిస్తోందని గుర్తు చేశారు. 
 
మరింత విస్తరించాలి....
కియా కంపెనీలో ఇప్పటికే ఏటా 70 వేల వాహనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతుండగా, సంస్థ మరిన్ని ప్లాంట్లు, విభాగాలు ప్రారంభించాలని సీఎం ఆకాంక్షించారు. కియా సంస్థ ఏటా 3 లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి చేరాలని, తద్వారా ఇంకా ఎందరికో ఉపాధి లభిస్తుందని అన్నారు.
 
పూర్తి అండగా నిలుస్తాం...
కియా సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందని, ఆ కంపెనీకి సానుకూలంగా వ్యవహరిస్తామని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం పరిశ్రమలకు పూర్తి స్థాయిలో ప్రోత్సహం అందిస్తుందని అని ఆయన వివరించారు.

భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్‌ బాంగ్ కిల్ మాట్లాడుతూ కియా మోటార్స్ మొదటిసారి గా తయారుచేసిన కారు సెల్టోస్ కాంప్యాక్ట్ ఎస్ యూవీ కాగా, ఆగస్టులో దేశంలో విడుదలైన సెల్టోస్ కారు అధికంగా అమ్ముడై నవంబర్ నాటికి 40,649 యునిట్లను విక్రయించినట్లు తెలిపారు. నూతన మేడ్ ఇన్ ఇండియా సెల్టోస్ కు ఆర్డర్ లు కేవలం మూడు నెలల కిందటే ప్రారంభించామని, అయినా ఈ స్థాయిలో విజయవంతం కావడం శుభపరిణామమన్నారు.

కియా పరిశ్రమ గ్లోబల్ సీఈవో హాన్ వూ పార్క్ మాట్లాడుతూ కియా కార్లకు దేశంలో మంచి ఆదరణ ఉందని, ఒకేరోజు 6 వేలకు పైగా బుకింగ్స్‌ వచ్చాయని చెప్పారు. నేడు తమ సంస్థ నూతన ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి వచ్చిన ఇక్కడి కియా యూనిట్ దేశీయంగా ఉత్పత్తి చేసే సెల్టోస్ వంటి పలు రకాల కార్లను ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ దేశాల్లోని కార్ల మార్కెట్లకు సరఫరా చేసేందుకు అవకాశాలను సుసాధ్యం చేస్తోందన్నారు.

భవిష్యత్తులో గ్లోబల్ ఉత్పత్తి నెట్వర్క్‌లో తాము ప్రముఖ భాగం కానున్నామన్నారు. ప్రపంచంలోనే 4వ అత్యంత భారీ నూతన మరల తయారీ సంస్థగా నిలిచిందన్నారు. ఈ  కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మరియు మున్సిపల్ పట్టణాభివృద్ధి మరియు పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఎం.గౌతమ్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ,

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.జయరాం, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, హిందూపురం ఎంపీ కె.గోరంట్ల మాధవ్, కియా మోటర్స్‌ ఎండీ కూఖ్యున్ షిమ్, ఎమ్మెల్సీలు మహమ్మద్ ఇక్బాల్, వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉషశ్రీ చరణ్, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, సిద్ధారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జేసి ఢిల్లీరావు, జేసి2 సుబ్బరాజు, సబ్ కలెక్టర్ నిషాంతి, ట్రైనీ కలెక్టర్ జాహ్నవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, డెలిగేట్స్, కియా మోటర్స్‌ ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసులో సిట్​ ముందుకు బీటెక్​ రవి